కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రెచ్చిపోయారు. మోడీ అవినీతి పరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని తప్పుబట్టారు. ‘‘మోడీ దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలి“ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దేశం ఆకలి రాజ్యం
మోడీ చేతగానితనం వల్లే దేశంలో కరెంట్ కోతలు, నీళ్ల తగాదాలు వస్తున్నాయన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్నారు. రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయన్న ఆయన 40 ఏళ్లపాటు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళీకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారని ఆరోపించారు.
కుక్కమూతి పిందెలు!
మోడీ పాలనలో దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు. కరోనా సమయంలో మోడీ తెలివితక్కువ లాక్డౌన్ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నాకు అందింది. నిన్నే మమతా బెనర్జీ , మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. నిన్న జనగామలో మాట్లాడితే బీజేపీ నేతలు.. నువ్వెంత అని నన్ను విమర్శిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలని అన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ బీజేపీ అని దుయ్యబట్టారు. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటేనే.. ఈ దేశానికి అంతా మంచి జరుగుతుందన్నారు. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి బాగోతాలు చెబుతానని కేసీఆర్ చెప్పారు.
రాహుల్‌కు మద్దతు
రాహుల్ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారని కేసీఆర్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గురించి అసోం సీఎం అసభ్యంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. రాహుల్‌ను ఉద్దేశించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు తనను కలచి వేశాయని వెల్లండించారు. మోడీ గారు.. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మీ సంస్కారమా? అని ప్రశ్నించారు. అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మాన్ని, నిజాన్ని కాపాడేందుకు తెలంగాణ సమాజం పులిలా కొట్లాడుతుందని ప్రకటించారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ అన్నారు.