ఆంధ్రప్రదేశ్ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సాక్ష్యాత్తూ మోడీ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం ..అసలు తనది ఏపీనే కాదన్నట్టుగా నో కామెంట్స్ అంటున్నారు.
ఈ క్రమంలోనే జగన్ వైఖరిపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. జరిగిన నష్టంపై ఏపీ నేతలు కోర్టుకెళ్లరని, పార్లమెంటులో అడగరని, ఇంత దమ్ములేని పరిస్థితికి వచ్చామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఓ నోటీసు ఇవ్వడానికి దమ్ములేదా? అని ప్రశ్నించారు.
మోడీకి పాదాభివందనం చేస్తూనే…అయ్యా మీరన్న మాటే కదా…పార్లమెంటులో చర్చిద్దాం..అని అడగాలని జగన్ కు హితవు పలికారు. పార్లమెంటులో చర్చ జరిగితే అన్నీ బయటకు వస్తాయి…అని అన్నారు. రాష్ట్ర విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని ఉండవల్లి ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని, ప్రాంతీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీని కాంగ్రెస్, బీజేపీలు విడగొట్టాయని ఉండవల్లి మండిపడ్డారు. ఏపీలోని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయని, రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఇలా ఉంటే…వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఏమిటో తెలియడంలేదని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates