వినటానికే విచిత్రంగా ఉంది వ్యవహారం. సొంతపార్టీ ఎంఎల్ఏనే కలవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదట. కారణం ఏమిటంటే జిల్లాల పునర్వ్యస్ధీకరణ నేపధ్యమే అని సమాచారం. విషయం ఏమిటంటే 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కడప జిల్లాని రెండుగా విభజించింది ప్రభుత్వం. కడప జిల్లా యథాతథంగా ఉండగా రెండోది రాయచోటి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటయ్యింది. దీన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందని అందరు అనుకున్నారు. అయితే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని రాజకీయపార్టీల నేతలు ఏకమైపోయారు. వీరికి లోకల్ జనాలు కూడా మద్దతుగా నిలిచారు. దాంతో రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డి కూడా తోడవ్వక తప్పలేదు. కొద్దిరోజులుగా పై రెండు నియోజకవర్గాల్లో బందులు, ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని బహుశా జగన్ జీర్ణించుకోలేకపోయినట్లున్నారు.
జనాల డిమాండ్ ను ఎంఎల్ఏ ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు జిల్లా కలెక్టర్ ను కలిసి వివరించారు. అలాగే జనాల మనోగతాన్ని వివరించేందుకు ఎంఎల్ఏ మేడా ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ కోరారట. అయితే ఎంఎల్ఏని కలవటానికి జగన్ అంగీకరించలేదట. ఈ విషయాన్ని అఖిలపక్షం సమావేశం సందర్భంగా ఎంఎల్ఏ సోదరుడు మేడా విజయశేఖరరెడ్డే స్వయంగా చెప్పారు. జనాల డిమాండ్ ను సీం దృష్టికి తీసుకెళ్ళటానికి తన సోదరుడు ప్రయత్నిస్తే జగన్ అపాయిట్మెంట్ ఇవ్వటానికి ఇష్టపడలేదని చెప్పారు.
ఎంఎల్ఏని కలవడానికి జగన్ ఎందుకు నిరాకరించారనే విషయం ఎవరికీ తెలీదు. కాకపోతే జిల్లాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ప్రజల ఆకాంక్షలు తెలిపేందుకు అపాయిట్మెంట్ కోరిన ఎంఎల్ఏని జగన్ కలవటానికి ఇష్టపడలేదనే విషయమే హైలైట్ అయ్యింది. ఇది కచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టు చూపుతుందనటంలో సందేహం లేదు. రేపటి ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. కానీ ఇపుడైతే జనాలు ఆందోళనను మరింత పెంచటం మాత్రం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates