వంగ‌వీటి జిల్లా డిమాండ్… వైసీపీ రియాక్ష‌న్ ఇదే..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అన్ని ప‌క్షాల నుంచి కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటే… మ‌రి కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న వారిలో అధికార వైసీపీకి చెందిన వారు కూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నారు. ఇక ప్ర‌భుత్వం ఆయా ప్రాంతాల వారీగా సెంటిమెంట్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ కొన్ని జిల్లాల‌కు కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు పెట్టింది. ఎన్టీఆర్ – అల్లూరి సీతారామ‌రాజు – అన్న‌మ‌య్య – బాలాజీ – వైఎస్సార్ ఇలా కొన్ని పేర్లు ఆయా జిల్లాల‌కు పెట్టింది. కీల‌మైన కృష్ణా జిల్లాను విడ‌దీసి విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డ్డ జిల్లాకు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ పేరు పెట్టింది.

జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర‌లోనే తాను ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న మాట నెర‌వేర్చేశారు. అయితే ఇప్పుడు విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంతో కొంద‌రి నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. దివంగ‌త కాపు నేత వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వంగ‌వీటి కుటుంబ స‌భ్యుల‌తో పాటు కొంద‌రు కాపు వ‌ర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మెజార్టీ ప్ర‌జ‌ల ఆమోదం మేర‌కే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పారు.

ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మే తాము కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఎన్టీఆర్ పేరు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు పెట్టామ‌ని చెప్పారు. ఇక ప్ర‌భుత్వం కూడా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన అభ్యంత‌రాలు ప‌రిశీలిస్తోంద‌ని చెప్పారు. ఇక జిల్లాకే చెందిన మ‌రో మంత్రి కొడాలి నాని కూడా ఇదే అంశంపై స్పందించారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేసిన‌ప్పుడే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తామ‌ని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఎన్టీఆర్ జిల్లాను డిసైడ్ చేశార‌ని అన్నారు. ఇక ఇద్ద‌రు నానిలు ఈ సున్నిత‌మైన విష‌యంలో ఆచితూచే స్పందించారు. ఇక రంగా పేరు పెట్టే విష‌యంలో ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్న‌ది మాత్రం క్లారిటీ వ‌చ్చింది.