అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మిగిలిన రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఏఐఎస్ (ఆల్ ఇండియా సర్వీస్) క్యాడర్ ప్రధానంగా ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల మార్పులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను అడిగింది. ఇందులో తొమ్మది రాష్ట్రాలు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను రాతమూలకంగా పంపాయి. అలాగే 8 రాష్ట్రాలు అనుకూలంగా అభిప్రాయాలను పంపాయి.
ఇంకా అభిప్రాయం పంపని రాష్ట్రాల్లో ఏపీనే కీలకం. కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకించిన రాష్ట్రాలన్నీ బీజేపీయేతర రాష్ట్రాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, కేరళ, రాజస్ధాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే అనుకూలంగా మధ్యప్రదేశ్, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఏపీ నుంచి ఎలాంటి నిర్ణయమూ ఇంకా తీసుకోలేదు.
సర్వీసు నిబంధనలు మార్పుల్లో కేంద్రం వాదన ఏమిటంటే కేంద్రంలో డిప్యుటేషన్ పై పనిచేసే ఐఏఎస్ అధికారుల సంఖ్య బాగా తగ్గిపోతోందట. అందుకనే రాష్ట్రాల నుండి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ తెప్పించుకునేందుకే సర్వీసు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు డిప్యుటేషన్ అంటే సదరు అధికారిని పంపటానికి రాష్ట్రం కూడా అంగీకరించాలి. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రం అభిప్రాయంతో పనేలేదు. కేంద్రానికి ఎవరినైనా పంపమంటే పంపాల్సిందే.
ఈ నిబంధననే రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అవసరమైతే యూపీఎస్సీ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించి మెరికల్లాంటి యువత, విద్యావంతులను ఏఐఎస్ క్యాడర్ కు ఎంపిక చేసుకోవచ్చు కదాని నిలదీస్తున్నాయి. మరీ పరిస్ధితుల్లో జగన్ ఎలాంటి అభిప్రాయం చెబుతారో అని అందరు చూస్తున్నారు. కేంద్రం వాదనతో విభేదిస్తే అప్పుడు ఓట్లు 10-8 అవుతాయి. ఒకవేళ కేంద్రానికి అనుకూలంగా ఉన్న ఓట్ల సంఖ్య 9-9 అవతాయి. ప్రస్తుత పరిస్ధితుల్లో కేంద్రం నిర్ణయానికి జగన్ ఊ అంటార లేకపోతే ఊహూ అంటారా చూడాలి.