కేసీఆర్ బాట‌లో జ‌గ‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల స‌మ‌స్య త‌ల‌నొప్పిగా మారింది. పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో మొద‌లైన ర‌గ‌డ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆ జీవోలు ఉప సంహ‌రించుకోవాల‌నే డిమాండ్‌తో ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు. ఆ మేర‌కు స‌మ్మె నోటీస్ కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లూ చేస్తున్నారు. మ‌రోవైపు చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఉద్యోగ సంఘాల‌ను మంత్రులు పిలిచినా వాళ్లు నిరాక‌రించారు. జీవో ర‌ద్దు చేస్తేనే చ‌ర్చ‌ల‌కు వ‌స్తామ‌ని తెగేసి చెబుతున్నారు.

పీఆర్సీ కోసం కొంత‌కాలంగా ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌లు చేయ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం 23.29 ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించింది. తీరా ఆ జీవోలు విడుద‌లైన త‌ర్వాత చూస్తే గ‌తంలో కంటే త‌క్కువ జీత‌మే వ‌స్తుంద‌ని భావించిన ఉద్యోగ సంఘాల‌న్నీ పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ఒక్క‌ట‌య్యాయి. ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఫిబ్ర‌వ‌రి 6 అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మె చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఓ వైపు ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతుంటే జ‌గ‌న్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. వైసీపీ మంత్రుల చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌డం మిన‌హా మ‌రో అడుగు ముందుకు వేయ‌లేదు.

దీంతో ఉద్యోగుల ఉద్య‌మ నేప‌థ్యంలో జ‌గ‌న్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాట‌లో సాగుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు స‌మ్మె చేశారు. 2019 అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌లో కార్మికులు ఉద్ధృతంగా ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. దాదాపు 48 వేల మంది కార్మికులు ఈ ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని, వేత‌న స‌వ‌ర‌ణ చేయాల‌ని, ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించాల‌ని ఇలా త‌దిత‌ర డిమాండ్ల‌తో కార్మికులు ఉద్య‌మం చేశారు. కానీ ఈ ఉద్య‌మంపై కేసీఆర్ ఉక్కుపాదం మోపార‌నే అభిప్రాయాలున్నాయి. కార్మికుల స‌మ్మెను కేసీఆర్ ప్ర‌భుత్వం అణ‌చివేసింది. ఉద్యోమంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన చ‌లించ‌లేదు. చివ‌ర‌కు ఉద్యుగులే స‌మ్మె విర‌మించి విధుల్లో చేరారు. ఆ త‌ర్వాత వాళ్ల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్ వివిధ హామీలు కురిపించి తిట్టిన నోళ్ల‌తోనే పొగిడించుకున్నారు.

ఇప్పుడు ఏపీలో ఉద్యోగులు స‌మ్మె నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా కేసీఆర్ లాగే వ్య‌వ‌హ‌రిస్తారా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. అందుకే స‌మ్మె నోటీసు ఇచ్చినా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి  స్పంద‌న రావ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ ఉద్యోగులు స‌మ్మెలోకి వెళ్తే గ్రామ స‌చివాల‌య సిబ్బందితో పాటు ఇత‌రుల‌తో ఆ ప‌నులకు అడ్డంకి రాకుండా చూసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. దీన్ని బ‌ట్టి స‌మ్మె ప్ర‌భావం ప‌డ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం జాగ్ర‌త్త ప‌డుతుంద‌ని తెలిసింది. దీంతో జ‌గ‌న్ కూడా కేసీఆర్ బాట‌లోనే సాగి స‌మ్మెను అణిచి వేస్తార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో ప‌రిస్థితులు వేరు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం కొండంత అప్పుల్లో ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఉద్యోగులు స‌మ్మె చేస్తే మ‌రింత న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.