రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి.. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి అరెస్టు ఉదంతం శుక్రవారం మొత్తం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన్ను గుంటూరు జీజీహెచ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు ఆయన్ను విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టుకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి.
అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయనకు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదే సమయంలో ఆయనకు అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని కోరారు. అచ్చెన్నాయుడితో పాటు అదుపులోకి తీసుకున్న ఏ1 రమేశ్ కుమార్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో రమేశ్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా.. అచ్చెన్నాయుడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు హైడ్రామాచోటు చేసుకుంది. తొలుత ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అచ్చెన్నాయుడ్ని విజయవాడ సబ్ జైలుకు తీసుకొచ్చారు. సుమారు గంట పాటు సబ్ జైలు బయట ఎస్కార్ట్ వాహనంలోనే ఉంచేశారు. అనంతరం సబ్ జైలు నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించాలని నిర్ణయించారు.
మొత్తంగా చూస్తే.. మందుల కొనుగోలు విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ.. శుక్రవారం ఉదయం అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలు చుట్టుముట్టటం.. ఇంటి ప్రహరీ గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించటం తెలిసిందే. ఉదయం 7.10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ అధికారులు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే అచ్చెన్నాయుడ్ని అదుపులోకి తీసుకొని ఊరు దాటించటం తెలిసిందే.
అలా శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మొదలైన వ్యవహారం.. శనివారం ఉదయం వరకూ పలు మలుపులు తిరిగి.. తాజాగా ఆయన్ను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి చేర్చారు. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates