“మీది పాలనా.. లేక ఆదిపత్యమా?“ అంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రాలను చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్రాల హక్కులను కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తు న్నారని.. నిప్పులు చెరిగారు. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఆరు పేజీల లేఖ రాశారు. రాష్ట్రాలకు ఇష్టంలేకున్నా ఐఏఎస్‌లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా కేడర్ రూల్స్-1954ను మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం లేఖలో తెలిపారు. ఇవి రాష్ట్రాలు-కేంద్రానికి మధ్య ఉన్న సున్నిత బంధంపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. తాము ఇలాంటి ప్రతిపాదనలకు.. నిర్ణయాలకు ఎట్టి పరిస్థితిలోనూ మద్దతిచ్చేది లేదని తెలిపారు. వెంటనే బేషరతుగా ఇలాంటి ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు.
మోడీ తరచూ ప్రస్తావించే వల్లభభాయ్ పటేల్ ప్రవచించిన సహకార సమాఖ్యస్ఫూర్తిని ఆ నిర్ణయం దెబ్బతీస్తుందని తాజాగా రాసిన లేఖలో కేసీఆర్ సైతం పేర్కొన్నారు. అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉండిపోతాయని వివరించారు. కొత్త నిర్ణయం అమలైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఐఏఎస్‌లలో భయం ఏర్పడుతుందని లేఖలో అభిప్రాయపడ్డారు. మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates