జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. నటుడు నాగబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్లేస్ మారుతుందా? ఆయనను ఏకంగా జిల్లా నుంచి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే.. జనసేన నేతల మధ్య జరుగుతున్న టాక్ వింటే ఔననే అంటు న్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికల్లో తొలిసారి నాగబాబు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేశారు. వాస్తవానికి 2007లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా.. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, తొలిసారిజనసేన అధినేత పవన్ ఆహ్వానం మేరకు 2019 ఎన్నికల్లో పార్లమెంటు కు పోటీ చేశారు.
చిరు కుటుంబం సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేశారు. అయితే.. త్రిముఖ పోటీ ఏర్పడింది. ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేయడంతో నాగబాబు విజయం అందుకోలేక పోయారు. వాస్తవానికి కాపులు ఎక్కువగా ఉండడం, క్షత్రియ సామాజిక వర్గం కూడా కలిసి రావడంతో నాగబాబు గట్టిపోటీనే ఇచ్చారు. రెండున్నర లక్షల పైచిలుకు ఓటు సాధించారు. అయినప్పటికీ.. 35 వేల ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. నిజానికి ఎన్నికల సమయంలో అందరిలాగానే నాగబాబు కూడా ప్రజలకు హామీ ఇచ్చారు.
గెలుపు గుర్రం ఎక్కినా ఎక్కక పోయినా.. తాను ప్రజల్లోనే ఉంటానని.. ప్రజల తరఫున ప్రశ్నిస్తానని చెప్పారు. అయితే.. ఆయన అలా చేయలేక పోయారు. కారణాలు ఏవైనా కూడా నియోజకవర్గానికి నాగబాబు రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా రాలేదు. దీంతో నియోజకవర్గంలో నాగబాబును తలుచుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇక, వచ్చే ఎన్నికల్లో మళ్లీ నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేసినా.. మళ్లీ అదే ఫలితం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలావుంటే.. అసలు వచ్చే ఎన్నికలలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నా.. లేదా.. ఇప్పటికే పొత్తుతో ఉన్న బీజేపీ-జనసేన పోటీ చేసినా..నరసాపురం టికెట్‌ను పొత్తు పార్టీకి వదిలేసి.. తాము వేరే చోట నుంచి పోటీ చేసే యోచనలో జనసేన ఉంది.
ఇప్పటికే ఉన్న అంచనాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం నుంచి నాగబాబు పార్లమెంటుకు పోటీ చేస్తార ని తెలుస్తోంది. కాపులు ఎక్కువగా ఉండడం, అధికార పార్టీ నేతలపై ఇక్కడ ప్రజలు అంతో ఇంతో ఆగ్రహంతో ఉండడం వంటివి జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పైగా కాకినాడ నియోజకవర్గంలో చిరు అభిమాన సంఘం రాష్ట్రంలోనే ముందుంది. దీంతో కాకినాడ నియోజకవర్గం అయితే.. నాగబాబుకు విజయం అందిస్తుందని.. అదే నరసాపురం అయితే.. ప్రజల్లోలేని కారణం గా కూడా ఆయనకు మళ్లీ ఇబ్బందులు తప్పవనే అంచనాలు ఉన్నాయి. దీంతో నాగబాబుకు వచ్చే ఎన్నికల్లో కాకినాడ కేటాయిస్తారని.. జనసేన నేతల్లోనూచర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates