ఏ ప్రభుత్వానికైనా.. ఏ పాలకుడికైనా పట్టు విడుపులు ఉండాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ మాట ఏపీ సీఎం జగన్ విషయంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం తెగేదాకా లాగుతున్న పరిణామాలు.. వారి పీఆర్సీ విషయంలో అనుసరిస్తున్న ధోరణి.. ఒకరకంగా..సీఎంకు ఆయనకు మద్దతిచ్చే కొందరికి నచ్చిందేమో కానీ.. చాలా మంది సీనియర్లకు నచ్చడం లేదు. దీనికి కారణం.. ఇలాంటి ధోరణి.. ఉద్యోగులకు తాత్కాలికంగా నష్టం చేకూరుస్తుందేమో కానీ.. దీర్ఘకాలంలో చూసుకుంటే.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న సున్నిత బంధం తెగిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అన్నీ ఇస్తున్నాం.. అడగనవీ ఇస్తున్నాం! అని సీఎం చెబుతున్నారు. అయితే.. అడిగినవి ఇవ్వడం చాలు అని ఉద్యోగులు అంటున్నారు. కానీ, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని.. లేకపోతే.. ఇంతకన్నా మెరుగ్గా.. పీఆర్సీ ఇచ్చేవారమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు మధ్య సయోధ్య చేకూరడం లేదు. దీంతో ఉద్యమాలకు ఉద్యోగులు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిలో ఒక్క ఉద్యోగులు మాత్రమే కాకుండా.. కాంట్రాక్టు ఎంప్లాయీస్ సహా, అన్ని శాఖల ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధం కావడం.. అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రేపు ఒక్కసారిగా అన్ని సంఘాలు ఉద్యమిస్తే.. ప్రభుత్వానికే తీవ్ర నష్టం వస్తుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఖజానా ఉద్యోగులు సమ్మెకు దిగడంతో దాదాపు వెయ్యి బిల్లుల వరకు క్లియర్ కాకుండా నిలిచిపోయాయి. ఇక, క్షేత్రస్థాయిలో అన్ని పనులు ఆగిపోతే.. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం కూడా ప్రజలకు చేరే అవకాశం ఉండదు. పైగా ఈ నెల 25న ఈబీసీ నేస్తం వంటి కీలక పథకాన్ని జగన్ రెండో దఫా అమలు చేయనున్నారు. అప్పటికే ఉద్యోగులు సమ్మెలో ఉంటే.. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? ఎవరు అమలు చేస్తారు? ఇదొక్కటే కాదు.. ఒకటో తారీకు పింఛన్ల పంపిణీ వలంటీర్లు చేసినా.. దీనికి సంబంధించిన నిధులు మాత్రం ఖజానా శాఖ నుంచే ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే బిల్లులు పెండింగులో పెట్టిన ఖజానా ఉద్యోగులు.. అప్పటికి కూడా లైన్‌లోకి రాకపోతే.. పింఛన్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ హెచ్చరించారు. ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి.. ఉద్యోగులతో సంప్రదింపులు చేయడం ద్వారా.. మున్ముందు ఏర్పడే కష్టాలను తొలగించుకునే అవకాశం ఉంటుందని.. ఈ విషయంలో భేషజాలకన్నా.. ప్రజా ప్రయోజనమే మంచిదని ఆయన సూచించారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు.
పీఆర్ సీ తగ్గించినా.. ఎప్పుడు ఇస్తామో చెబితే.. ఉద్యోగులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని.. పట్టు పట్టినట్టు వారితో వ్యవహరిస్తే.. మనకే మంచిది కాదని వారు అంటున్నారు. అయితే.. ఈ విషయంలో అటు జగన్ కానీ.. ఇటు ఉద్యోగులు కానీ.. బెట్టు వీడకపోవడం గమనార్హం. ఏ సంక్షేమంపై సీఎం జగన్ ఆశలు పెట్టుకున్నారో.. అదే సంక్షేమం ఉద్యోగుల నిరవధిక సమ్మెతో రేపు ప్రజలకు చేరకపోతే.. ఫలితం జగన్‌కే వ్యతిరేకంగా మారుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా.. జగన్ ఒకమెట్టు దిగితే బెటరనేదివారిసూచన మరి ఏం చేస్తారో చూడాలి.