పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటి వరకు చర్చలకు సై అన్న ఉద్యోగ సంఘాలు.. ఇక, ఉద్యమమే సరైన చర్యగా పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఏన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు.
పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. సీఎస్ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి. అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు.
విధివిధానాలు ఎలా ఉండాలన్నదానిపై చర్చించాం. పోరాట కార్యాచరణపై సమావేశంలో చర్చించా అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి తేవొద్దని పేర్కొంది. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. మరి ఇప్పుడు సర్కారు ఏం చేస్తుందో చూడాలి.