ఇరు తెలుగు రాష్ట్రాలకు ‘సర్’ వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 2026 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది.
ఇప్పటికే రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సన్నాహక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు దశాబ్దాల తర్వాత ఇంత విస్తృత స్థాయిలో ఓటరు జాబితాల ప్రక్షాళన చేపట్టడం విశేషం.
‘సర్’లో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు కొనసాగడం, చిరునామా మార్పులు సవరించకపోవడం వంటి లోపాలను గుర్తించి సరిచేయడం ప్రధాన లక్ష్యం. అవసరమైన గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలు పరిశీలించి అర్హులైన వారినే జాబితాలో కొనసాగించనున్నారు. సరైన పత్రాలు లేని నమోదులను తొలగించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న వారు కొత్తగా ఓటరు నమోదుకు అర్హులు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఓటరూ తమ వివరాలను ముందుగానే సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు కాబట్టి ‘సర్’ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates