జాతీయ రాజకీయాల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అవసరమైన కసరత్తులు చేయడం లేదన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవకాశాలను వదులుకుని కాంగ్రెస్ తప్పు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పంజాబ్‌లోనూ దాన్ని నిలబెట్టుకునే దిశగా అవసరమైన చర్యలు పార్టీ అధినాయకత్వం తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలను హైకమాండ్ పట్టించుకోవడం లేదని.. ఇలా అయితే ఎన్నికల్లో దెబ్బ తప్పదని అంటున్నారు. ఇక పంజాబ్ సంగతి పక్కనపెడితే గోవాలోనూ కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమి పేరుతో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల సమావేశాలూ జరిగాయి. కానీ విపక్షాల కూటమిని నడిపించే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని భావించిన ఇతర పార్టీలు నెమ్మదిగా తప్పుకుంటున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి ప్రత్యామ్నయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తోంది. ముఖ్యంగా దీదీ గోవాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
మరోవైపు తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మమత కూడా మరో పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకూ అక్కడ దృష్టి సారించలేదని తెలుస్తోంది. అలా కాకుండా మహారాష్ట్రలో కూటమిలో ఉన్న పార్టీలతో కాంగ్రెస్ కలవకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒంటరిగా పోటీ చేసి అధికార బీజేపీని ఓడించి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కాలని చూస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేకుండానే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి ముందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమతో జట్టు కట్టకపోవడం కాంగ్రెస్ దురదృష్టమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న అంచనాలు కలుగుతున్నాయి.