సొంత జిల్లాలో ఏమి జరుగుతోందో జగన్మోహన్ రెడ్డికి తెలుస్తోందో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కన పెట్టేసినా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో రెగ్యులర్ గా నేతల మధ్య జరుగుతున్న గొడవలు పెద్దవైపోయాయి. ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంఎల్సీ రమేష్ యాదవ్ మధ్య గొడవలు చినికి చినికి గాలివానలా పెరిగిపోతున్నాయి.
తాజాగా వీరిద్దరి వర్గాల మధ్య జరిగిన గొడవలో ఎంఎల్సీ మద్దతుదారుడు తీవ్రంగా గాయపడటమే ఆశ్చర్యంగా ఉంది. అసలింతకీ విషయం ఏమిటంటే రాచమల్లుకి రమేష్ యాదవ్ ఒకపుడు ప్రధాన మద్దతుదారుడే. అయితే బీసీ నేత అయిన రమేష్ ను ఎంఎల్సీ పదవి వరించింది. బీసీ కోటాలో జగన్ ఏరికోరి రమేష్ ను సెలెక్ట్ చేశారు. దాంతో అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. బహుశా భవిష్యత్తులో రమేష్ తనకు పోటీ వస్తారని రాచమల్లు అనుమానించినట్లన్నారు.
అప్పటి నుండి ప్రతి విషయంలోను ఎంఎల్సీని రాచమల్లు వ్యతిరేకిస్తునే ఉన్నారు. వీళ్ళద్దరి వర్గాల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈనెల 16వ తేదీన రమేష్ పుట్టిన రోజు. అందుకనే పట్టణంలో భారీఎత్తున మద్దతుదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాన్ని రాచమల్లు మద్దతుదారు, కౌన్సిలరైన లక్ష్మీదేవి తప్పుపట్టారు. ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో రాచమల్లు ఫొటో లేదని అభ్యంతరం చెబుతు కొన్ని ఫ్లెక్సీలను చింపేశారు.
తమ ఫ్లెక్సీలను చింపేయటాన్ని ఎంఎల్సీ మద్దతుదారుడు రఘునాదరెడ్ అండ్ కో అడ్డుకున్నపుడు పెద్ద గొడవైంది. ఒకళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మరొకరి ఫొటో లేదన్న చిన్న ఘటనతో ఇంత పెద్ద గొడవ జరగటమే విచిత్రంగా ఉంది. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడనపుడు ఫ్లెక్సీల్లో ప్రత్యర్ధుల ఫొటోలు ఎందుకుంటాయి ? ఈపాట ఇంగితం కూడా లేకుండా రోడ్ల మీద పడి వైసీపీ నేతల వర్గాలు కొట్టేసుకుంటున్నారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే నియోజకవర్గంలో ఇన్ని గొడవలు జరుగుతుంటే జగన్ ఏమి చేస్తున్నారు ? ఇద్దరిని పిలిచి క్లాసు పీకుతారు అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. అందుకనే రోజు రోజుకు వీళ్ళద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి గొడవలను మొగ్గలోనే తుంచేయకపోతే చివరకు పెరిగి పెద్దవైపోవటం ఖాయం. అప్పుడు పుట్టి మునిగినా ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates