ఒకవైపు జనసేనతో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపితే రిటర్న్ లో జనసేన చంద్రబాబునాయుడుకు షరతులు విధిస్తున్నది. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము చంద్రబాబుకుందా అంటు చాలెంజ్ చేశారు. 2014లో రాష్ట్రం కోసం పవన్ భేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల్లో భేషరతుగా పవన్ కు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా అంటు చంద్రబాబును బొలిశెట్టి నిలదీశారు. చంద్రబాబును ఒకవైపు బొలిశెట్టి చాలెంజ్ చేస్తునే మరోవైపు ఆరోపణలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు కూడా రాష్ట్ర ద్రోహే అంటు ఆరోపించారు. జగన్ను ఎలాగైనా గద్దె దింపాల్సిన అవసరం చంద్రబాబుకే కానీ తమకు లేదని స్పష్టంచేశారు.
అవినీతి టీడీపీ, అరాచక వైసీపీ నుండి రాష్ట్రానికి విముక్తి కావాలంటే జనాలే జనసేనపార్టీని గెలిపించుకుని పవన్ను ముఖ్యమంత్రిని చేస్తారనే ధీమాను వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో కావాల్సింది జనాల మద్దతే కానీ పార్టీల మద్దతు కాదని గట్టిగానే చురకలంటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అఖిలపక్ష సమావేసం నిర్వహించటం లేదని జగన్ ప్రభుత్వంపై మండిపోయారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినట్లుగానే ఇపుడు జగన్ ప్రభుత్వం కూడా చేస్తోందన్నారు.
చంద్రబాబు విషయంలో బొలిశెట్టి ఆరోపణలు, వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే పవన్ కు తెలీకుండా జరిగిందని అనుకునేందుకు లేదు. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తునే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన విషయాలను బొలిశెట్టి తవ్వి తీయటం చూస్తే ఉద్దేశ్యపూర్వకంగానే చేసినట్లుంది. పవన్ కు తెలీకుండా చంద్రబాబుపై బొలిశెట్టి ఇంత ఘాటుగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేసే అవకాశం లేనేలేదు. బొలిశెట్టి చాలెంజ్ పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates