2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు తాజాగా మరో బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. అంచనాల మేరకే కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్నది స్పష్టమైంది.
అయితే ఆయన అమరావతి రాజధాని నినాదంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తికర అంశంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. దానికి బిల్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఇటీవల దాన్ని వెనక్కి తీసుకున్నారు. మరిన్ని మార్పులతో బిల్లును సరికొత్తగా తీసుకొస్తామని ప్రకటించారు. మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నినాదంగా ఎన్నికలకు వెళ్తానని రఘురామ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దాని వెనక అసలు కారణం ఏమిటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీకి నరసాపురంలో మంచి బలమే ఉంది. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు ఆ పార్టీ తరపున గెలిచారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు. అయితే కేవలం బీజేపీని మాత్రమే నమ్ముకుని పోతే ప్రయోజం ఏ మేరకు ఉంటుందనే విషయం ఆయనకు తెలియంది కాదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అక్కడ వైసీపీని ఎదుర్కొని గెలవాలంటే అమరావతి నినాదాన్ని తీసుకు వచ్చి.. దానికి మద్దతిచ్చే పార్టీల సహకారం పొందాలని రఘురామ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన మద్దతు కీలకమని ఆయన అనుకుంటున్నారని సమాచారం. అందుకే అమరావతి నినాదంతో బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తే టీడీపీ, జనసేన మద్దతు కూడా తనకు లభిస్తుందని ఆయన భావించి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.