అయ్య తాగుబోతు.. కొడుకు తిరుగుబోతు: MP అరవింద్

తెలంగాణలో ఇప్పుడు అధికార పక్షం వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. నువ్వు ఒకటంటే నేనునాలుగు అంటా. నువ్వు నాలుగు అంటే నేను పది అంటానంటూ విరుచుకుపడుతున్న వైఖరి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిపోయేలా చేస్తోంది. ఒకవైపు తెలంగాణ అధికారపక్షంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతుంటే.. వాటికి కౌంటర్లు ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ భారీ ప్రెస్ మీట్ పెట్టటమేకాదు.. ఆయన సైతం తనకున్న మాటల సత్తాను ప్రదర్శిస్తున్నారు. ఇలా.. అధికార.. విపక్షాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలో ఇప్పుడు మరో సన్నివేశం చోటు చేసుకుంది.

బీజేపీ ఎంపీ ఆర్వింద్ పై ఇటీవల కాలంలో వరుస పెట్టి నమోదు అవుతున్న కేసులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏదైనా పోలీసు స్టేషన్ లో తనపై ఫిర్యాదు వచ్చి.. దానిపై కేసులు కట్టినంతనే.. హైకోర్టును ఆశ్రయించటం.. సదరు ఫిర్యాదు కమ్ కేసు విషయంలో ఎంపీ ఆర్వింద్ ను అరెస్టు చేయొద్దంటూన్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఎంపీ అర్వింద్ పై రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదు కావటం ఖాయమన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

తనపై పెడుతున్న కేసులకు సంబంధించి అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఆర్వింద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. తనపై వరుస కేసుల పెడుతున్న వెనుక డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారని మండిపడుతున్నారు.డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ స్పిరిట్ తనకు నచ్చుతుందన్న ఆయన.. తనపై కేసులు పెట్టే విషయంలో ప్రదర్శిస్తున్న ఉత్సాహం.. మంత్రి కేటీఆర్ పైన ఎందుకు చూపరని ప్రశ్నించారు.

డీజీపీ మహేందర్ రెడ్డికి తన కింది అధికారుల్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ తిట్టిన తిట్లకు సంబంధించిన క్లిప్ ఉందని.. ఆ మాటలు మహా వికారంగా ఉన్నాయని.. కావాలంటే దాన్ని వినిపిస్తానని అన్నారు. అందులో గలీజు వ్యాఖ్యలు ఉన్నాయని.. అమ్మా.. అయ్యా.. డ్యాష్.. డ్యాష్ బూతులు కూడా ఉన్నాయని.. మరి.. మంత్రి కేటీఆర్ మీద ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసులు ఎందుకు పెట్టటం లేదన్నారు. అంతేకాదు.. తాము కార్టూన్ వేశామని కేసులు పెడుతున్నప్పుడు.. తమపై టీఆర్ఎస్ కార్టూన్లు వేసినప్పుడు ఎందుకు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్..ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తాగుబోతు అని.. కొడుకు కేటీఆర్ తిరుగుబోతుగా సంచలన ఆరోపణలు చేశారు. ‘తండ్రి తాడుతాడు.. కొడుకు ఊగుతాడు. ఏడ ప్రపంచంలో ఎక్కడైనా తాగినోడు ఊగుతాడు. తెలంగాణలో అయ్య తాగితే కొడుకు ఊగుతాడు. ఒకడు తాగుబోతు. ఒకడు తిరుగుబోతు.వీళ్లను ఏమైనా అంటే.. అందుకు కేసులు పెడితే ధర్మపురి అర్వింద్ భయపడతాడా?’ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇక్కడితో ఆగని అర్వింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. ‘‘బిడ్డా.. కేసీఆర్.. మా అంటే నన్ను ఎలక్షన్ దాకా జైల్లో వేస్తావ్. మర్చిపోయి కూడా నా చేతిలో ఫోన్ ఉండనివ్వకు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు మా నాయన గురించి ఒక మాట అనుండే. డి శ్రీనివాస్ రెండు చేతుల్లో రెండు ఫోన్లు ఉంటే.. మొత్తం రాష్ట్రమంతా చక్రం తిప్పుతాడు. కాంగ్రెస్ పార్టీలో పవర్లోకి తెస్తాడని. నాకు రెండు ఫోన్లు కాదు.. ఒక్క ఫోన్ చాలు. బిడ్డా.. కేసీఆర్.. నిన్ను.. నీ కొడుకుని.. బట్టలూడదీసి.. నీ ఉద్యోగాలు పోయి.. నీ పార్టీని రోడ్డుకు ఈడుస్తా.. నా చేతిలో ఒక్క ఫోన్ ఉంటే. ఇది వార్నింగ్ అంటే అనుకో’’ అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వాడివేడీగా తయారవుతాయని చెప్పక తప్పదు.