తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. వివిద సందర్భాల్లో ఈమధ్య చంద్రబాబు రియాక్టవుతున్న విధానం వల్లే చంద్రబాబు తొందరపడ్డారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అంటే కుప్పం పర్యటనలో పొత్తు గురించి బహిరంగంగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎవరో కార్యకర్త జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదాని అడిగాడు. మామూలుగా అయితే ఆ మాటను చంద్రబాబు వినీ విననట్లు వదిలేసేవారే.
కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో చంద్రబాబు రియాక్టయ్యారు. లవ్ వన్ వే అయితే ఉపయోగం ఉండదు కదా అన్నారు. టీడీపీ లవ్ చేస్తున్నా జనసేన స్పందించటం లేదంటు చెప్పారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్పష్టంగా అర్ధం తెలిసిపోతుంది ఎవరికైనా. జనసేనతో పొత్తుకు తాను ఎంత ప్రయత్నిస్తున్నా జనసేన మాత్రం స్పందించటం లేదని అందరికీ అర్ధమైపోయింది. ఎదుటివారిలోని లోపాలను ఎత్తి చూపటమే కాని తనలోని లోపాలను బయటపెట్టుకునే రకం కాదు చంద్రబాబు.
కానీ ఇపుడు కుప్పంలో జరిగింది మాత్రం తన సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. చంద్రబాబు చెప్పిన రెండు డైలాగులతో పొత్తుల కోసం టీడీపీ ఎంతగా ఆతృత పడుతోందో అనే విషయం అందరికీ అర్ధమైపోయింది. అలాగే రెండో రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్నారు. ఇది కూడా చంద్రబాబులోని బలహీనతను ఎత్తి చూపుతోంది. పొత్తులో ఉన్నా ఓడిపోయాము, పొత్తులు లేకపోయినా గెలిచామన్నారు. పొత్తులు పెట్టుకున్నా కూడా ఓడిపోయింది మాత్రం వాస్తవం.
అలాగే పొత్తు లేకుండా కూడా గెలిచామని చెప్పటంలో ఒక అంతరార్థం ఉంది. తెలుగుదేం పార్టీ పొత్తుల్లేకుండా గెలిచిన మాట నిజమే. కానీ చంద్రబాబు నాయకత్వంలో పొత్తుల్లేకుండా తెలుగుదేశం గెలవలేదు అన్నది నిజమే. 2009 ఎన్నికల్లో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నా టీడీపీ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 2003, 2019లో ఒంటరిగా పోటీచేసినపుడు ఓడిపోయిన విషయం కూడా జనాలందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ చరిత్రను చూస్తే పై రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. పొత్తులు పెట్టుకోవటం, ఒంటరిగా పోటీ చేయటం చంద్రబాబు పర్సనల్ విషయం అనటంలో సందేహమే లేదు. కానీ ఏదేమైనా తన సహజ స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.