ప్రజలు అధికార పీఠమెక్కిస్తే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం వారిపై దాడులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలపై పోరాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందన్న బాబు.. బాధితుల్లో వైసీపీ నేతలూ ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని మండిపడ్డారు. మద్యం తయారీలోనూ రసాయనాలు కలుపుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచే పోటీ చేసి.. మళ్లీ సీఎం అవుతానన్నారు. టీడీపీ అధికారంలోకి రావటం.. తాను సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “ప్రజా సమస్యలపై పోరాడేవారిని వేధిస్తున్నారు. ఎన్నికల కోసం కుప్పం రాకున్నా ఏడుసార్లు గెలిపించారు. పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచాం. వైసీపీకి రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు.“ అన్నారు. తనకు కుప్పం నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. కుప్పం ఆస్పత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.
చంద్రన్నబీమా, పెళ్లి కానుక, బీసీలకు ఇచ్చే సబ్‌ప్లాన్, ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా ఇప్పుడు ఏమయ్యాయని ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలోని నూలుకుంట సభలో ప్రసంగించిన ఆయన.. తమ ప్రభుత్వ హయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. న్యాయం, ధర్మం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నా రు. బెదిరింపులకు భయపడేది లేదని.. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమందిని జైలుకు పంపిస్తారో మేమూ చూస్తామన్నారు.
నీతినిజాయతీకి మారుపేరైన కుప్పం నియోజకవర్గాన్ని చెడగొట్టేందుకు కొందరు దొంగలు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా.. భయపడే వాళ్లు లేరని అన్నారు. “రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏమయ్యాయి. న్యాయం, ధర్మం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బెదిరింపులకు భయపడేది లేదు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలి. ఎంతమందిని జైలుకు పంపిస్తారో మేమూ చూస్తాం. నీతినిజాయతీకి మారుపేరు కుప్పం. కుప్పం నియోజకవర్గాన్ని చెడగొట్టేందుకు కొందరు దొంగలు వచ్చారు. ఎవరెన్ని బెదిరింపులు చేసినా భయపడే వాళ్లు లేరు. చదువుకున్న యువత ముందుకొస్తే.. వారికి అండగా ఉంటా“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates