తన హత్యకు రెక్కీ జరిగిందని టీడీపీ నాయకుడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీని గురించే జోరుగా చర్చ సాగుతోంది. రాధా ఆరోపణలు చేసిన తర్వాత టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధా ఇంటికి వెళ్లి ఆయనకు తాను అండగా ఉన్నాననే సందేశమిచ్చారు. ధైర్యంగా ఉండమని పార్టీ తరపున భరోసా ఇచ్చారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా రాధా వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించి వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ తన సొంత సామాజికవర్గమైన కాపు వర్గం నుంచి రాధాకు మద్దతు కరవైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ రాధా విషయంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
మద్దతు ఇవ్వలేదని..
గతంలో వైసీపీలో ఉండి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు వచ్చే ఎన్నికల నేపథ్యంలో బాబు ప్రాధాన్యతనిస్తున్నారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రాధాను బరిలో దింపుతారని సమాచారం. ఈ నేపథంలోనే ఆయనకు బాబు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు రాధాను వైసీపీలో చేర్చుకునేందుకు కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాధా టీడీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో తనపై హత్యకు రెక్కీ జరిగిందనే ఆరోపణలు చేసిన రాధాకు టీడీపీ మద్దతుగా నిలిచింది. కానీ విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కాపులు, బ్రాహ్మణులు బలంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బొండా ఉమ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తనకు రాధా మద్దతు ఇవ్వలేదని ఒకవేళ మద్దతు ఇచ్చి ఉంటే గెలిచేవాడినని ఉమ అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది.
ఇక్కడ లేరని..
వచ్చే ఎన్నికల్లోనూ రాధా మూలంగా తనకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఉమ భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన రాధా ఆరోపణలపై స్పందించలేదని సమాచారం. ప్రస్తుతానికి ఉమ విజయవాడలో లేరని విదేశాల్లో ఉన్నారని అందుకే రాధా రెక్కీ ఆరోపణలపై స్పందించడం లేదని ఉమ వర్గం చెబుతోంది. కానీ ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఆయన కనీసం ఫోన్లోనైనా రాధాతో మాట్లాడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాధాకు ఉమ దూరంగా ఎందుకు ఉన్నారనే కారణాలపై చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు విజయవాడ టీడీపీలో ఓ వర్గంగా కొనసాగుతున్నారు. వాళ్లకు ఎంపీ కేశినేని నానికి పడడం లేదన్నది బహిరంగ రహస్యం. అలాంటిది నియోజకవర్గ బాధ్యతలను బాబు కేశినేని నానికి కట్టబెట్టడంతో ఉమ, వెంకన్న, నాగుల్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates