వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ముచ్చటగా మూడో సారి కూడా గద్దెనెక్కాలనే ఆశతో ఉంది. ఆ దిశగా పట్టుదలతో సాగుతోంది. కానీ అదంత సులభం కాదని ఆ పార్టీకి తెలుసు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి తగ్గుతున్న ఆదరణ.. ప్రభుత్వ వైఫల్యాలు.. కరోనా కట్టడిలో విఫలం.. పెరుగుతున్న ఇంధన ధరలను కట్టడి చేయలేకపోవడం.. ఇలా ప్రజల్లో మోడీపై వ్యతిరేకత పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టేందుకు శాయశక్తులా ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో పుంజుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అందులోనూ తెలంగాణలో కాస్త సానుకూల పరిస్థతి కనబడిందని పుంజుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
అదే తీరు..
కేంద్రంలో కుర్చీపై ఉన్న బీజేపీ.. అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడి సీఎంపై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. వాళ్లపై అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ జాతీయ నాయకులు పని కట్టుకుని మరీ ఆయా రాష్ట్రాల్లో దిగి అక్కడి ముఖ్యమంత్రులపై మాటల దాడి చేస్తారనేది తెలిసిన విషయమే. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ ప్రత్యేక హోదా విషయంలో 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో బంధాన్ని ఆయన తెంచుకున్నారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నించారు. దీంతో బాబుపై తీవ్రస్థాయిలో మోడీ సర్కార్ ఎదురు దాడికి దిగిన విషయం తెలిసిందే. చంద్రబాబుది అత్యంత అవినీతి ప్రభుత్వమని పోలవరం ప్రాజెక్టు బాబుకు ఏటీఎంలా మారిందని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పుడు కేసీఆర్‌పై..
ఇక ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌పై పోరాటానికి సిద్ధమైన బీజేపీ అలాంటి వ్యాఖ్యలే చేస్తుండడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీకి నిర్ణయించారు. కానీ కరోనా నేపథ్యంలో అందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విలేకర్ల సమావేశంలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని కేసీఆర్ కనుసన్నల్లోనే అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టు అసలు అంచనా వ్యయం రూ.36 వేల కోట్లు అయితే దాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు బాబుపై ఇప్పుడు కేసీఆర్‌పై బీజేపీ ఒకే రకమైన వ్యాఖ్యలు చేస్తుండడం ఆ పార్టీ ఉద్దేశాన్ని చాటుతుందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అగ్రనేతల్లో చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నిస్తున్నారు.