ష‌ర్మిల.. అన్నంత పని చేస్తారా?

రాజ‌కీయ నాయ‌కులు మాట‌లు చెప్ప‌డం ఎంతో సులువు.. కానీ వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డ‌మే క‌ష్ట‌మ‌న్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అధికారం కోస‌మో లేదా ప్ర‌త్య‌ర్థుల‌ను ఇబ్బందిలో పెట్ట‌డం కోస‌మో  నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతారు. భ‌విష్య‌త్ ప‌రిణామాల గురించి దృష్టిలో పెట్టుకోకుండా ఓ మాట అనేస్తారు. ఇప్పుడీ విష‌యం ఎందుకూ అంటే.. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లు అలాగే ఉన్నాయ‌ని నిపుణులు చెప్తున్నారు. ఏపీలో పార్టీ పెట్టొచ్చు అనే సంకేతాలు వ‌చ్చేలా ఆమె వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే అందుకు కార‌ణం.

ఇప్ప‌టికే ఇబ్బంది..
తాజాగా మీడియా స‌మావేశంలో ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఏపీలో పార్టీ పెడ‌తాన‌ని త‌నంత‌ట తానుగా ఆమె చెప్ప‌లేదు. ఏపీలో పార్టీ పెడ‌తారా? అని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు మాత్ర‌మే ఎక్క‌డైనా ఎప్పుడైనా పార్టీ పెట్టొచ్చ‌నే స‌మాధానం ఇచ్చారు. దీంతో జ‌గ‌న్ వ‌దిలిన బాణంగా చెప్పుకునే ష‌ర్మిల ఇప్పుడు  అన్న‌కే ఎదురు తిరుగుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వాస్త‌వ ప‌రిస్థితుల ప్ర‌కారం చూస్తే ఆమె ఏపీలో పార్టీ పెట్టే అవ‌కాశాలు త‌క్కువేన‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ పేరుతో పార్టీ పెట్టిన ఆమె నిల‌దొక్కుకునేందుకు శాయశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర‌, రైతు ఆవేద‌న యాత్ర అంటూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నా అనుకున్న స్పంద‌న రావ‌డం లేదు. పైగా పార్టీలోని కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వెళ్తున్నారు.

ఆ ఓట్లు మాత్ర‌మే..
ఇప్ప‌టికే అన్న జ‌గ‌న్‌తో విభేదాల కార‌ణంగానే ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత పార్టీ పెట్టుకున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్పుడ‌వే విభేదాలు మ‌రింత ఎక్కువై ఒక‌వేళ ఆమె మాట ప్ర‌కార‌మే ఏపీలో పార్టీ పెడితే ఏం సాధిస్తారు? అనే ప్ర‌శ్న విన‌ప‌డుతోంది. ఇప్పుడు జ‌గ‌న్ ఏపీలో అధికారంలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి తిరుగులేని బ‌లం ఉంది. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబే అక్క‌డ జ‌గ‌న్ దూకుడు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల అక్క‌డ పార్టీ పెడితే జ‌గ‌న్ పార్టీకి ప‌డే ఓట్లు చీల్చ‌డం త‌ప్ప ఒరిగే ప్ర‌యోజనం ఏముండ‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వైఎస్ అభిమానులు.. ఆయ‌న కుటుంబ ఓట్లు మొత్తం జ‌గ‌న్కు ప‌డ్డాయి. ఇప్పుడు ష‌ర్మిల వ‌స్తే వాటిలో కొన్ని ఆమెకు వ‌చ్చే వీలుంటుంది. అంతే కానీ టీడీపీ, జ‌న‌సేన ఓట్లు ఆమెకు ప‌డ‌వ‌ని నిపుణులు అంటున్నారు. జ‌గ‌న్ ఓట్ల‌లోనే ఆమె పంచుకోవాలి. అలా జ‌రిగినా జ‌గ‌న్‌కు జ‌రిగే డ్యామేజీ ఏమీ ఉండ‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ష‌ర్మిల ఏపీలో పార్టీ పెట్ట‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.