ట్విస్ట్‌లు ఇస్తున్న రాజుగారు… పొత్తులు సెట్ చేస్తున్నారా?


ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరిట వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎండగడుతున్న రఘురామ….ఇకపై ఏపీలోకి అడుగుపెట్టి రాజకీయం చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేయకుండా ఉన్న రఘురామ…ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిసింది. జనవరి 7న సంచలన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే రఘురామ అప్పుడు ఎన్ని ట్విస్ట్‌లు ఇస్తారో క్లారిటీ లేకుండా ఉంది.

ఆయన వైసీపీకి రాజీనామా చేసి, ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి, బీజేపీలో చేరతారని తెలిసింది. బీజేపీలో చేరితేనే వైసీపీ ఏ మాత్రం టచ్ చేయలేదనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకే ఆయ‌న ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్నారు. కాకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం వస్తుంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి నరసాపురం ఉపఎన్నిక బరిలో దిగాలని చూస్తున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌కు వెళితే అప్పుడు పరోక్షంగా  టీడీపీ మద్ధతు తీసుకోవాలని రఘురామ చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే బీజేపీ-జనసేనలు ఎలాగో పొత్తులో ఉన్నాయి. ఆ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తే రాజుగారు…వైసీపీని ఓడించడం కష్టం. టీడీపీ మద్ధతు తీసుకుంటేనే…వైసీపీకి చెక్ పెట్టగలుగుతారు. లేదంటే గెలుపు చాలా కష్టమైపోతుంది. ఇక ఇక్కడ నుంచే టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తు ఖాయమవుతుందనే ప్రచారం కూడా ఉంది. కానీ అది ఎంతవరకు నిజమవుతుందనేది తెలియదు.

అసలు రాజు గారు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనేది పూర్తి క్లారిటీ లేదు. కాకపోతే టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైపుకు వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల మాదిరిగానే…రాజు గారు బీజేపీకి మద్ధతు ఇస్తారా ? లేక వైసీపీని ఇరుకున పెట్టడానికి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల బరిలో నిలబెడతారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా రాజు గారు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారో చూడాలి.