బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మొత్తానికి లాఫింగ్ స్టాక్ అయిపోయారు. వీర్రాజు ఏమి మాట్లాడినా కామెడీగా ఉంటోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ 2024లో బీజేపీ అధికారంలోకి రాగానే ముందు రాజధాని అమరావతిని నిర్మించేస్తారట. పనిలో పనిగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేయించేస్తారట. ఇంకా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నిధులను విడుదల చేయించి పూర్తి చేసేస్తారట.
మొన్నటి బహిరంగ సభలో మాట్లాడుతూ చీప్ లిక్కర్ ను 50 రూపాయలకే ఇస్తానని ఇచ్చిన హామీ గుర్తుండే ఉంటుంది. వీర్రాజు హామీలు, మాటలు విన్న తర్వాత ఎవరికైనా నవ్వు రావాల్సిందే. ఎందుకంటే మూగవాడు అమ్మా అనేదెప్పుడనే సామెతుంది. అలాగే ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేదెప్పుడు, రాజధాని, పోలవరం ప్రాజెక్టులను నిర్మించేదెప్పుడు. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే బదులు ముందు నిధులను విడుదల చేయించచ్చుకదా.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేయించాలంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరంలేదు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అవసరమైన నిధులను విడుదల చేయించచ్చు. అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కూడా ఆపేయించచ్చు. రాజధాని విషయం పూర్తిగా బీజేపీ చేతిలో లేదు కాబట్టి చేయగలిగిందేమీ లేదు. కానీ పోలవరం, వైజాగ్ స్టీల్ విషయం నూరుశాతం బీజేపీ చేతిలోనే ఉంది.
వీర్రాజు మాటలు ఎలాగున్నాయంటే 2024లో అధికారంలోకి వచ్చేస్తామనే పిచ్చి భ్రమల్లో ఉన్నట్లున్నారు. అధికారంలోకి వచ్చే అవకాశం ఏ రూపంలోనూ లేదని అందరికీ బాగా తెలుసు. ఒకవైపు ఏపీ ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ తుంగలో తొక్కేస్తోంది. విభజన హామీలను పూర్తిగా దెబ్బకొట్టింది. ఇందుకనే జనాలు కమలం పార్టీపై మండిపోతున్నారు. ఈ విషయాలు తెలిసి కూడా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని వీర్రాజు చెబుతున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది.
అధికారంలోకి వచ్చేస్తామనే కలలు కనే బదులు ముందు పార్టీ తరపున 175 నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్థులను రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అభ్యర్ధులుగా పోటీ చేయటానికి పార్టీకి గట్టి అభ్యర్ధులే లేరిపుడు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ, ఎంఎల్ఏ అభ్యర్ధుల్లో ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. క్షేత్ర స్దాయిలో పార్టీ పరిస్థితి ఇలాగుంటే వీర్రాజు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.