వీళ్లకు జగన్మోహన్ రెడ్డే రైటేమో-నాగబాబు

కొంత కాలంగా సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలకు కేంద్రంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడం ద్వారా ఆయన పెద్ద దుమారానికే తెరతీశారు. ఆ వివాదం కొన్ని రోజుల పాటు కొనసాగి.. తర్వాత సద్దుమణిగింది. ఐతే అలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా సినీ పరిశ్రమ వ్యవహారాలు, ఏపీ రాజకీయాల మీదికి ఫోకస్ మళ్లించారాయన.

తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు తనను పిలవలేదంటూ చిరు అండ్ కో మీద కారాలు మిరియాలు నూరిన బాలయ్య మీద నాగబాబు మండిపడ్డ సంగతి తెలిసిందే. దీని మీద వాదోపవాదాలు నడిచాయి. అదే సమయంలో తెలుగుదేశం‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు నాగబాబు. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన నాగబాబు.. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియా మీద హాట్ హాట్ కామెంట్లతో వార్తల్లోకి వచ్చాడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నాగబాబు పాజిటివ్ కామెంట్ చేయడం గమనార్హం.

‘‘టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్‌ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకైనా తెగించే సాహసం, మన బాబుకి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబు గారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్’’ అంటూ ముగించిన నాగబాబు.. చివర్లో బ్రాకెట్ పెట్టి ‘‘ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి’’ అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు.

సందర్భం ఏదైనా కావచ్చు.. జనసేనాని మెయిన్ టార్గెట్ అయిన జగన్‌ గురించి నాగబాబు ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యకరమే.