జగన్‌తో ట్వంటీ22 ఆడనున్న పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం, పాలక పార్టీ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సుదీర్ఘకాలం పాలనలో ఉంటే వచ్చే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత… నాయకత్వ లేమితో వచ్చే స్థాయిలో పాలక పార్టీలో వర్గ పోరు అక్కడ కనిపిస్తున్నాయి. మూడేళ్ల వయసు ప్రభుత్వానికి ఎదురవ్వాల్సిన పరిస్థితులు… పదేళ్ల వయసున్న పార్టీలో జరగాల్సిన పరిణామాలు కావివి. కానీ, ఏపీలోని జగన్ ప్రభుత్వం… ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌తో ఈ ఏడాది పరిస్థితులు ట్వంటీ22 ఆడుకుంటాయన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మూడేళ్లకే మొహం మొత్తేసింది

2019 ఎన్నికల్లో గెలవడానికి ముందు హామీలతో, గెలిచాక పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేని దాతలా కనిపించారు. ఓట్ బ్యాంక్ బ్యాంకు ఖాతాలలో అర్హతలను బట్టి కొందరికి నెలనెలా… మరికొందరికి ఆర్నెళ్లకోసారి… ఇంకొందరికి ఏడాదికోసారి వివిధ పథకాల పేర్లతో డబ్బులు పడ్డాయి. ఓటర్లు ఖుషీ. జగన్‌ది సంక్షేమ ప్రభుత్వం అనే బ్రహ్మాండమైన ట్యాగ్ కూడా వచ్చింది. అదే సమయంలో అభివృద్ధికి మాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పనుల్లేవు, ప్రాజెక్టులు లేవు, కొత్త కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు… పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు లేవు. ఫలితం… ఇక్కడి కంపెనుల, ప్రాజెక్టులు తమ దారి తాము చూసుకుని తరలిపోవడం మొదలైంది.

ప్రభుత్వానికి రాబడి మార్గాలు మూసుకుపోయాయి. జీతాలు, పథకాల కోసం ఖర్చు మాత్రం పెరిగిపోవడం మొదలైంది. అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఉద్యోగుల జీతాలే కాదు రిటైర్ అయినవారి పెన్షన్లూ సకాలంలో ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఉద్యోగుల, పెన్షనర్లలో వ్యతిరేకత బలపడిపోయింది. పైగా సీపీఎస్ రద్దు హామీకి కట్టుబడకపోవడం, పీఆర్సీలో మతలబు చేయడంతో ఈ వర్గం మరింత మండిపడుతోంది. 2019 ఎన్నికల్లో జగన్‌కు కొమ్ము కాసి విజయంలో సాయపడ్డారని చెప్పే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం ఇప్పుడు జగన్ పేరు చెబితే ఒంటి కాలిపై లేస్తోంది.

మరోవైపు నెలనెలా ఇచ్చే సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలకూ డబ్బుల్లేక ప్రతి నెలా తిప్పలే. దీంతో ఏటా అర్హుల సంఖ్య తగ్గిపోతోంది. రకరకాల కారణాలతో కొందరికి పథకాలు అందడం లేదు. దీంతో గవర్నమెంటు డబ్బులు తింటున్నోళ్లు, తిననివాళ్లు అనే వర్గీకరణ ఏర్పడిపోయి ప్రభుత్వం నుంచి పథకాలు అందనివారంతా వ్యతిరేకత పెంచుకున్నారు. ఇవి కాకుండా మద్యం ధరలు చుక్కలనంటాయన్న కారణంతో… ఇసుక బంగారమైపోయిందన్న రీజన్‌తో… అనుకూలంగా లేమని వైఎస్సార్ నేత రివెంజ్ తీర్చుకుంటున్నారన్న కోపంతో…. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న ఆక్రోశంతో…. ఏపీ అప్పులపాలైపోయిందన్న ఆవేదనతో… ఉద్యాగాలు లేవు భవిష్యత్తు ఎలా అనే బెంగతో అనేక వర్గాల ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై పీకల్దాకా కోపం పెంచుకున్నారు.

ఫలితంగా పూర్తిగా మూడేళ్లయినా కాక మునుపే జగన్ ప్రభుత్వం 30 ఏళ్లుగా పాతుకుపోయిన గవర్నమెంటుకు ఎదురయ్యే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. ముందుముందు మరింత పెరిగి ముప్పు తెచ్చేలా ఉందని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు.

పార్టీలో గోతి కాడ నక్కలు

ప్రభుత్వం సంగతి ఇలా ఉంటే పార్టీ సంగతి మరోలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడ్డానికి జగన్మోహనరెడ్డి నాయకత్వంలో పార్టీ ఏకతాటిపై ఉంటూ దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నా వైసీపీలో గ్రూపు రాజకీయాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాలపై వ్యతిరేకతలు, నాయకుల మధ్య లుకలుకలు, పదవులు రాలేదన్న అలకలు, పనులు జరగడం లేదన్న చికాకులు అన్నీ కనిపిస్తున్నాయి. స్థానికంగా చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సయోధ్య లేదు. మరికొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.

ఇక పార్టీ అధినేత, తమ దైవం జగనన్నను కలిసే అవకాశం దొరకడం లేదని… సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలే తమకు అధిష్ఠానాలుగా మారిపోయారన్న కోపం చాలామంది ఎమ్మెల్యేలలో ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్నవారయితే రెండున్నరేళ్లయినా ప్రస్తుత మంత్రివర్గాన్ని ఇంకా మార్చకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచినవారు కూడా ఏమాత్రం సంతృప్తిగా లేరు. అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు లేకపోవడంతో వారికి కోపం పెరుగుతోంది.

మరోవైపు అంతా తామే అయి నడిపిస్తున్న ముగ్గురు కీలక నేతల మధ్య కూడా ఒకరిపై ఒకరికి స్పర్థలు పెరుగుతున్నాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైకి వ్యక్తంచేయకపోయినా జగన్ సీబీఐ కేసుల్లో బెయిలు రద్దయి జైలుకు వెళ్తే మళ్లీ బెయిలు వచ్చే లోగా ఒక్క రోజయినా సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్న ఒకరిద్దరు గోతికాడ నక్కలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.