కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఇటలీకి వెళ్లిన వైనంపై బీజేపీ తప్పు పడుతోంది. బాధ్యత లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. ఈ వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పడుతోంది. వ్యక్తిగత టూర్ ను ఎందుకింత రాద్దాంతం చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇంతకూ ఏమైందంటే..
ప్రస్తుతం దేశంలో కరోనా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడి నుంచి వచ్చే వారు అప్రమత్తంగా ఉంటున్నారు.
అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరగటమే కానీ తగ్గట్లేదు. దీంతో.. అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లొద్దన్నట్లుగా పలువురు సూచన చేస్తున్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వాలు సైతం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇలాంటివేళ.. రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్లారు. ఇదో ఇష్యూగా మారింది. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో రాహుల్ బాధ్యతను మరిచి విదేశాలకు ఎలా వెళతారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. బీజేపీ నేతలు రాహుల్ ఇటలీ పర్యటననుప్రశ్నిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ విదేశాలకు వెళ్లటం బాధ్యతారాహిత్యమని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు.
అంతేకాదు.. తరచూ ఆయన ఫారిన్ ట్రిప్ లకు ఎందుకు వెళుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే అంశంపై కేంద్రమంత్రి అమిత్ షా రాహుల్ విదేశీ పర్యటనలకు సంబంధించి వివరాల్నివెల్లడించిన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో అంటే.. ఐదేళ్ల కాలంలో 247 సార్లు రాహుల్ విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. తన విదేశీ పర్యటన సందర్భంగా కనీస ప్రోటోకాల్ కూడా పాటించరని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు వాదన మరోలా ఉంది. ఆయన వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్లారని.. ఈ విషయాన్ని బీజేపీ ఎందుకు అంత రచ్చ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎందుకు.. తరచూ తాను విదేశీ పర్యటనలకు ఎందుకు వెళుతున్నాన్న విషయం మీద రాహుల్ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా? ఎంత వ్యక్తిగతమైన తర్వాత.. ప్రజాసేవలో పునీతమవుతామని చెప్పే వారికి ప్రైవేటు అంటూ ఏం ఉంటుంది చెప్పండి