రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కాస్త దూకుడుగా వెళుతోంది. గత అధ్యక్షుల పనితీరుకు.. రేవంత్ పనితీరుకు పోలిక కొట్టిచ్చినట్లు కనపడుతోంది. అయితే పార్టీ భవిష్యత్తు కోసం రేవంత్ ఒక్కడే కష్టపడుతున్నా మిగతా నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం సభ్యత్వాల నమోదులో స్పష్టంగా కనపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డిజిటల్ సభ్యత్వ నమోదును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అయితే.. నిజామాబాద్ జిల్లాలో ఈ పథకం నత్తనడకగా సాగుతోందట. నియోజకవర్గానికి 30 వేల సభ్యత్వాల లక్ష్యంగా 5 సెగ్మెంట్లలో లక్షా 50 వేల సభ్యత్వాలను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 15 వేల సభ్యత్వాలే నమోదు అయ్యాయట.
జిల్లా ముఖ్యుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం.. నియోజకవర్గ ఇన్చార్జిలు.. నేతలను నియమించకపోవడం.. నేతల మధ్య విభేదాలు ఉండడం సభ్యత్వాల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఇందూరు జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 2004లో 9 అసెంబ్లీ.. 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న హస్తం పార్టీ.. 2009లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 2014, 18 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవని పార్టీ దీనస్థితిలోకి వెళ్లిపోయింది.
జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలంతా పార్టీకి దూరమవడం.. పార్టీకి నంబర్ 2గా చెప్పుకున్న వారు కూడా మోసం చేసి వెళ్లిపోవడంతో పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాతే పార్టీలో కొంత ఉత్సాహం వచ్చింది. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కీని ప్రచార కమిటీ చైర్మన్గా కూడా నియమించడంతో ఇక పార్టీకి తిరుగులేదనే భావనకు వచ్చారు. కానీ అది చేతల్లో మాత్రం కనపడడం లేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ విషయంలో దృష్టి సారించాలని.. పార్లమెంటు సమావేశాల అనంతరం పూర్తిగా కార్యకర్తలకే అంకితం అవ్వాలని అభిమానులు కోరుతున్నారు. అసమ్మతి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని గాడిలో పెట్టాలని ఆశిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించాలని.. నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించాలని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలా ముందుకు వెళతారో.. అధిష్ఠానం టాస్కును ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాలి.