అక్రమాస్తుల కేసుల విచారణలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం పై సీబీఐ కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. హెటిరో, అరబిందో కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించిన వివాదంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడైన జగన్ హాజరుకాని విషయాని న్యాయమూర్తి బీ. మధుసూదనరావు ప్రస్తావించారు. దాంతో జగన్ లాయర్ మాట్లాడతు విచారణలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు.
ప్రతి విచారణ సందర్భంగా ఏదో కారణం చెప్పి ప్రధాన నిందితుడు విచారణకు హాజరు కావడం లేదని, బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు నిందితుడు హాజరుకావాల్సిందే కదా అంటు జగన్ లాయర్ ను నిలదీశారు. అప్పుడు జగన్ తరపున లాయర్ మాట్లాడుతూ బెయిల్ షరుతుల సమయంలో నిందితుడు కేవలం ఒక ఎంఎల్ఏ, ఒక ఎంపీగా మాత్రమే ఉన్నారని కానీ ఇపుడు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాకుండా ఒకపుడు విచారణ నెల రోజులకు ఒకసారి జరిగేదని కానీ ఇపుడు వారంలో ఐదు రోజులు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ మంజూరు చేసినప్పటి పరిస్ధితులకు ఇప్పటి పరిస్థితుల్లో వచ్చిన తేడాను జగన్ లాయర్ న్యాయమూర్తికి వివరించారు. ఒకవేళ విచారణ సందర్భంగా తమ క్లైంట్ తప్పక హాజరు కావాల్సిందే అని ఆదేశిస్తే హాజరవుతారని లాయర్ చెప్పారు. ఇదే విషయాన్ని మెమో రూపంలో చెప్పాలని న్యాయమూర్తి చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ మధ్య వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని కేసు వేశారు. అయితే ఆయన పిటీషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దాంతో ఎంపీ వెంటనే ఇదే విషయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. విచిత్రమేమిటంటే జగన్ బెయిల్ రద్దు చేయాలన్న తన డిమాండ్ కు అవసరమైన సాక్ష్యాలను మాత్రం ఎంపీ చూపటం లేదు.
అలాగే విచారణలో జగన్ వ్యక్తిగత మినహాయింపును రద్దు చేయమని కోరుతున్నది చెప్పటంలేదు. ఎంతసేపు బెయిల్ రద్దు చేయాలని, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని మాత్రమే కోరుతున్నారు. అసలు జగన్ కేసులకు రఘురామకు ఎలాంటి సంబంధం లేదు. జగన్ కేసుల్లో ఎంపీ సాక్షీ కాదు అలాగని బాధితుడూ కాదు. ఏ విధంగాను సంబంధంలేని ఎంపీ జగన్ మీద వ్యక్తిగత కక్షతోనే వరసబెట్టి కేసులు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates