లోకేశ్ లో మార్పు.. కారణం ఏమిటి?

Lokesh

సంక్షోభాలు కొన్నిసార్లు కొంతమందికి అద్భుతమైన అవకాశాల్ని ఇస్తుంటాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అలాంటి అవకాశమే లాక్ డౌన్ కల్పించిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అందునా.. అనుకోని రీతిలో హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో.. తనకు లభించిన సమాయాన్నిలోకేశ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. లాక్ డౌన్ వేళ కఠిన నిబంధనల్ని పాటించి ఏకంగా పదిహేను కేజీల బరువు తగ్గిన లోకేశ్ భౌతికంగానే కాదు.. ఆయనలో చాలానే మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. దగ్గర దగ్గర నెలన్నరకు పైనే ఆయన ఇంట్లోనే ఉండాల్సిన వేళలో ఏం జరిగిందో కానీ.. లోకేశ్ రూపంలోనే కాదు.. మాటలోనూ చాలానే తేడా వచ్చేసినట్లుగా తెలుగు తమ్ముళ్లు అదే పనిగా చెబుతుండటం గమనార్హం.

నోరు విప్పి నాలుగు మాటలు మాట్లాడితే చాలు..ఏదో ఒక తప్పు దొర్లటం.. సోషల్ మీడియాలో కామెడీ చేసుకోవటానికి అవసరమైన కంటెంట్ ఇచ్చేస్తారన్న పేరున్న లోకేశ్.. తన తీరుకు భిన్నంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాన్ఫిడెంట్ గా ఉండటమే కాదు.. మాట్లాడిన తీరు.. ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు సరికొత్తగా ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ శీర్షికతో ఇరవై పేజీల చార్జిషీట్ విడుదల చేశారు చినబాబు. ఆ సందర్భంగా జగన్ ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలు.. ఆరాచకాలంటూ ఏకరువు పెట్టిన ఆయన.. ఏడాదిలో రూ.87వేల కోట్ల అప్పులు చేయటమే కాదు.. రాష్ట్ర ప్రజలపై రూ.50వేల కోట్ల భారాన్ని మోపినట్లుగా చెప్పారు.

చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన 34 సంక్షేమ పథకాల్ని రద్దు చేసినట్లు ఆరోపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను తెలుగు సరిగా మాట్లాడకపోవటాన్ని తనకు తానే ప్రస్తావించి.. జగన్ ప్రభుత్వం మీద చేసిన విమర్శ చూస్తే చినబాబు మాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తాను ఇంగ్లిషు మీడియంలో చదువుకొన్నానని.. తెలుగులో చదవకపోవటంతో తానిప్పుడు తెలుగు సరిగా మాట్లాడలేక విమర్శలు ఎదుర్కొంటున్నానని.. తాను చేసిన తప్పు ఎవరూ చేయొద్దన్న లోకేశ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తన లోపాన్ని తన ప్రత్యర్థిపై అస్త్రంగా వాడాలన్న ఆలోచన చూస్తే.. లోకేశ్ లో రాజకీయ పరిణితితో పాటు చతురత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లిషు మీడియంను ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి.. అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తే.. కీలక స్థానాల్లో ఉండి కూడా మాట పడాల్సి వస్తుందని.. చులక కావటం ఖాయమన్న విషయాన్ని లోకేశ్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి.

ఇంతకీ.. ఈ మార్పు అంతా ఎలా సాధ్యమైంది? అన్నది అసలు ప్రశ్న. చుట్టూ నిరాశ. అంతకు మించిన దారుణ ఓటమి. చేతిలో తిరుగులేని అధికారం నుంచి ఏమీ చేయలేని దైన్యం. మరోవైపు ప్రత్యర్థి చెలరేగిపోతున్న వేళ.. ఇప్పుడేమీ చేయకుంటే ఇంకెప్పటికి చేయలేమన్న విషయం అర్థం కావటమే కాదు.. తాను మారకుంటే .. తననే మార్చేసే రాజకీయాన్ని లోకేశ్ బాగానే అర్థం చేసుకున్నట్లుంది.

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు చిన్న ఎన్టీఆర్ తోనే అన్న వాదనకు పుల్ స్టాప్ పెట్టాలంటే తాను మొత్తంగా మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. దీనికి సంబంధించి కసరత్తు ఎంత తీవ్రంగా సాగిందనటానికి పదిహేను కేజీల బరువు ఒక ఉదాహరణ అయితే.. తాజా ప్రెస్ మీట్ ను చినబాబు హ్యాండిల్ చేసిన వైనంతో ఇట్టే అర్థమైపోతుందంటున్నారు.