ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తొలిసారి.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విజృంభించారు. మోడీ హిందువు కాదని.. ఆయన హిందూత్వ వాది అని చెప్పారు. హిందువును అధికారంలోకి ఉంచుకోవచ్చన్న ఆయన.. హిందూత్వవాదిని ఒక్క నిముషం కూడా అధికారంలోకి ఉంచడానికి వీల్లేదని చెప్పారు. మోడీని తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధులు కావాలని రాహుల్ పిలుపునిచ్చారు.
భారత రాజకీయాల్లో హిందూ- హిందుత్వవాది అనే రెండు పదాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది
అని రాహుల్ గాంధీ చెప్పారు. రాజధాని రాజధాని జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలో చాలా ఉద్వేగంగా ఆయన ప్రసంగించారు. ప్రతి మాటలోనూ మోడీని టార్గెట్ చేశారు. అదేసమయంలో బీజేపీని కూడా ఎండగట్టారు. మహాత్మాగాంధీ హిందూ అని, గాడ్సే హిందుత్వవాదని చెప్పారు. హిందుత్వవాదులు జీవితామంతా అధికారం కోసం తపిస్తుంటారని విమర్శించారు.
ఇలాంటి వారిలో కరడు గట్టిన హిందూత్వ వాదానికి మోడీ ప్రతిరూపమని విమర్శలు గుప్పించారు. హిందుత్వవాదులు సత్యాగ్రహం పాటించరని, అధికారం కోసం పాకులాడతారని ఎద్దేవా చేశారు. హిందుత్వవాదులు 2014 నుంచి అధికారంలో ఉన్నారని, వారిని అధికారం నుంచి తొలగించి హిందువులకు అధికారం కట్టబెట్టాలని,.. తక్షణమే వారిని తరిమి కొట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు. హిందువంటే అందరినీ కలుపుకుని పోయేవాడని, ఎవరికీ భయపడడని రాహుల్ చెప్పారు. అన్ని మతాలనూ గౌరవించేవాడే హిందువని అన్నారు.
”కానీ, మోడీకి ఎస్సీలంటే గిట్టరు. ముస్లిం మైనార్టీ అంటే.. గిట్టదు. వారికి ఎవరికీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కూడా కల్పించరు. కనీసం.. వారిని చూసేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి వారిని హిందువుగా ఎలా పరిగణిస్తాం. వారికి గాడ్సే దేవుడు. గాడ్సే జయంతులు వారికి పండగలు. అలాంటి వారు ఒక్కనిముషం కూడా అధికారంలో ఉండేందుకు అవకాశం లేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. హిందువుగా చలామణి అవుతున్న పెద్ద హిందూత్వ వాది!” అని మోడీని కార్నర్ చేస్తూ.. నిప్పులు చెరిగారు. కాగా, జైపూర్ బహిరంగసభకు జనం కనీ వినీ ఎరుగని రీతిలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యారు.