మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. వైఎస్ కుటుంబంతోనూ ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబం. ముఖ్యంగా జగన్ మోహన్‌రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపిన మర్రి రాజశేఖర్.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. జగన్ అన్యాయం చేశారంటూ.. స్వయంగా ఆయన బావమరిది బహిరంగ కామెంట్లు చేశారు. జగన్ కోసం తాము ఎంతో చేశామని చెప్పిన.. ఆయన.. తమను ఇంతగా అన్యాయం చేస్తారని కానీ.. మోసం చేస్తారని కానీ.. ఊహించలేదన్నారు.
దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నమర్రి ఫ్యామిలీ.. ఇక, జగన్ విషయంలో దూకుడుగా నే ముందుకు వెళ్లనుందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. గత 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ వైసీపీ టికెట్‌పై పోటీ చేయాల్సి ఉంది. అయితే.. ఆ సమయంలో విడదల రజనీ అరంగేట్రంతో ఈ టికెట్‌ను ఆమెకు కేటాయించారు. ఈ క్రమంలోనే మర్రికి స్వయంగా జగన్.. హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తామని.. మంత్రిని కూడా చేస్తామని.. హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. ఇప్పటి వరకు మర్రిని జగన్ పట్టించుకోలేదు.
పైగా.. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన గుంటూరు జిల్లాకే చెందిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో మర్రి కుటుంబంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మర్రి రాజశేఖర్‌కు.. ఎమ్మెల్సీ, మంత్రి హామీ అంటూ మోసం చేశారని ఆయన కుటుంబం తొలిసారి గళమెత్తింది. చిలకలూరిపేటలో.. మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు హాజరైన మర్రి రాజశేఖర్ బావమరిది వెంకట సుబ్బయ్య.. వైసీపీ అధిష్టానంపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మర్రి రాజశేఖర్ కూడా సభలోనే ఉండడం గమనార్హం.
ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసినప్పుడు గుండెల్లో పెట్టుకుని చూస్తామని నమ్మబలికారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టామని వాపోయారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రజనికి టికెట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామన్నారు. మేం పోటీకి దూరంగా ఉండి పార్టికి సేవ చేశాం. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్లు సహకరించలేదు. అయినప్పటికీ.. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ, మేం జగన్ సీఎం కావాలని కోరుకున్నాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు మా టికెట్ లాక్కుని మాకే అన్యాయం చేశారు! అని నిప్పులు చెరిగారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates