ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా తలపడుతున్నారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధిన పత్రాలు ఇవేవి ఉద్యోగులకు అందలేదు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాయ మాటలు నమ్మి వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టమని తెలిపారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్యోగుల అంతర్గత సమావేశంలో చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగి కుటుంబంలో 5గురు ఓటర్లున్నారని, ఈ ఓట్లు కలిస్తే సుమారు 60 లక్షల ఓట్లు అవుతాయన్నారు. ఈ ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు… నిలబెట్టనూ వచ్చని పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని గుర్తుచేశారు. ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు చచ్చిపోతున్నా.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టే.. ఇటీవల మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లో విజయమని బండి శ్రీనివాసరావు తెలిపారు.
మరోవైపు పీఆర్సీ, పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి ఉద్యోగులు సిద్దమవుతున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ పోరుబాట షెడ్యూల్ ను ఖరారు చేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదని, అందువల్లే ఆందోళన సిద్దమవుతున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చేందుకు ముందుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల పోరుబాట షెడ్యూల్ ఇదే
*డిసెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు.
*మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు.
*డిసెంబర్ 16న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి *మధ్యాహ్నం 2వరకు ధర్నా.
*డిసెంబర్ 21వ తేదీ నుంచి 26 వరకు జిల్లా కేంద్రాల్లో ధర్నా.
*డిసెంబర్ 27న విశాఖపట్టణంలో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు.
*డిసెంబర్ 30వ తేదీన తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
*జనవరి 3న ఏలూరులో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
*జనవరి 6న ఒంగోలులో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు.