కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు.
చంద్రబాబును దారుణంగా తిట్టారని, ఓ మంత్రి అయితే రేయ్, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయిందని ఉండవల్లి అన్నారు. విపక్ష నేతలు, మనుషులను వైసీపీ మంత్రులు గౌరవించాలని ఉండవల్లి హితవు పలికారు. ఎన్టీఆర్ కుమార్తెల గురించి తానెప్పుడూ ఏ రకమైన పుకార్లు వినలేదని, హరికృష్ణ, పురంధేశ్వరిలతో తనకు పరిచయం ఉందని అన్నారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అనుకోవడం లేదని, సింపతీ పనిచేయదని చంద్రబాబుకు తెలుసని అన్నారు. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు జగన్ భజన చేసి పాటలు పాడారని ఎద్దేవా చేశారు.
జగన్ పాలన అట్టర్ ప్లాప్ అని, జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని ఉండవల్లి సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు లేవు కాబట్టే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా గెలుస్తున్నారని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బాగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. కానీ, జగన్ మాత్రం రెండున్నరేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని ఉండవల్లి విమర్శించారు. జగన్ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..? అని సవాల్ విసిరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates