అసెంబ్లీలో ఫోన్ల వాడకంపై తమ్మినేని సంచలన నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు.

తనపై వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు తీవ్ర ఆవేదనతో సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేయడం పలువురిని కలచివేసింది. దీంతో, ఆ ఘటనను కొందరు టీడీపీ సభ్యులు ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి సభ్యులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని తమ్మినేని ఆదేశించారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో రావడంతో తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీ సభ్యుల విమర్శలను కొందరు సభ్యులు రికార్డు చేసిన నేపథ్యంలోనే తమ్మినేని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.