ఇదో అనూహ్యమైన ఘట్టం. ఆయనే పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తనను తన కుటుంబాన్నిఅధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. నిండు అసెంబ్లీలో ఘోరంగా అవమానించారనే ఆవేదనను ఆయన ఇప్పటికీ మరిచిపోలేదు. అయినప్పటికీ.. తన బాధల కన్నా.. ప్రజల బాధలే ముఖ్యమనుకున్నారు. తన ఆవేదనను, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పంటి బిగువున భరించి.. సీమలోని భారీ వర్షాలు, వరద బాధితులకు భరోసా నింపేందుకు ముందుకు కదిలారు. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజాగా ఆయన వరుసగా ఈ జిల్లాల్లో పర్యటించి ప్రజలకు భరోసా నింపుతున్నారు. నేనున్నానంటూ.. వారికి భరోసా కల్పిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఇక్కడి వారి బాధలను స్వయంగా తెలుసుకున్నారు. ఆయన ఇక్కడి వారితో ఏమన్నారంటే..
రాయలచెరువును పరిశీలించిన చంద్రబాబు నాయుడు… కడపలో పింఛా ప్రాజెక్టు తెగి గ్రామాలు తుడిచి పెట్టుకుని వెళ్ళే పరిస్ధితి వచ్చిందని అన్నారు. “చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురంలో ముందస్తు గానే అప్రమత్తం చేయాల్సిన పరిస్ధితి ఉంది. ప్రభుత్వం వైఫల్యం అడుగడుగునా కనపడుతోంది. కళ్యాణ్ డ్యాంకి నీరు వచ్చే కొద్ది ఒక్కో గేటు ఓపెన్ చేయాలి. అలా కాకుండా అన్ని గేట్లు ఒకే సారి తెరవడంతో ప్రమాదం జరుగుతుంది. ప్రకృతికి వ్యతిరేకంగా పని చేస్తే సమాజానికే ముప్పు వస్తుంది. స్వర్ణముఖి నది మొత్తం పరిశీలించి ఒక పెద్ద నదిగా చేయాలని భావించాను. కానీ, మీరు నన్ను దింపేశారు” అని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
“రాయలచెరువుకు ముప్పు వస్తే దాదాపుగా 30 గ్రామాల ప్రమాదం వచ్చే అవకాశం ఉన్న అధికారులు గుర్తించ లేక పోయారు. రాయలచెరువు సమీప గ్రామాల ప్రజలు అంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్ధితి ఉంది. ప్రభుత్వం తన బాధ్యతను మరిచి పోయింది. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ధైర్య సాహసాలు చేసిన యువతకి ప్రోత్సహం ఇవ్వాలని నిర్ణయించాం. నాకు రాయలచెరువుపై అనుభవం ఉంది. జిల్లాలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలని టిడిపి హయాంలో నిర్ణయించాం. అధికారులు, రాజకీయ నాయకులు రాయలచెరువుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదు. క్రింది ప్రాంతాల్లో నీరు అధికంగా ఉన్న సమయంలో పంట నష్టం జరిగే అవకాశం ఉంది” అని తెలిపారు.
“రాయలచేరువు సమీపంలోని ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఐదు గ్రామాల ప్రజలకు నష్ట పరిహారం కట్టించాలి. వరి గిట్టు బాటు ధర ఇరవై వేలు ఉన్న ధరను 12 వేలకు తీసుకొచ్చాడు తుగ్లక్ రెడ్డి. వరద కారణంగా సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. కష్టాల్లో ఉన్న ప్రభుత్వంకి అండగా ఉండడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను రాజకీయం కోసం రాలేదు. బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చా. పివి.పురంలో ఓ బాలిక పది రోజుల క్రితం గల్లంతైంది..ఇంత వరకూ మృతిదేహాన్ని గుర్తించే పరిస్ధితి లేదు. గాలిల్లో తిరిగి గాలి కబుర్లు చెబితే మంచితే కాదు. బ్రిడ్జ్ లు, చెక్ డ్యాంలపై ప్రభుత్వం దృష్టి సారించాలి” అని జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే.. ఆయనే అంత బాధలో ఉండి కూడా.. తమకు భరోసా కల్పించేందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.