ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆనందంలో ఉన్న మాజీ కలెక్టర్‌గా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో వివరణ ఇవ్వాలని ఆయనకు కోర్టు నోటీసులు పంపించింది. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. “వరి సాగు చేయవద్దు. విత్తనాలను విక్రయించరాదు. ఒకవేళ విక్రయిస్తే జైలుకు పంపుతా. కోర్టులకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నా దుకాణం తెరవనీయను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కారణ కింద ధర్మాసనం ఆయనకు తాజాగా నోటీసులు పంపించింది.
మరో ఏడాది సర్వీస్ ఉన్నప్పటికీ తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన్ని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలా రాజకీయాల్లోకి రాగానే పదవి యోగం పట్టిందనే ఆనందంలో ఉన్న ఆయనకు.. అప్పుడే సెగ మొదలైంది.
ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడి నుంచి మాటల పోటు.. ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు. అవినీతి, అక్రమాలతో పాటు ఐఏఎస్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గతంలో ఆయనపై రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపించాలని రేవంత్ ఇప్పటికే డిమాండ్ చేశారు.
విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఎలా మారారో? చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయన్ని శిక్షించేంతవరకూ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ బంట్రోతుగా వెంకట్రామిరెడ్డి పనిచేశారని ఔటర్ రింగ్‌రోడ్డును అష్ట వంకరలు తిప్పడంలో ఆయన పాత్ర ఉందని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయనపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణను కోర్టు మూసేసింది. కలెక్టర్‌గా ఆయన రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎమ్మెల్సీగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కొంతమంది పిటిషన్లు వేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ముగించింది. అయితే దీంతో వెంకట్రామిరెడ్డికి ఉపశమనమేమీ లభించదు. ఎందుకంటే ఆయన ఎన్నికకు వ్యతిరేకంగా ఎన్నికల పిటిషన్ వేసేందుకు వాళ్లు సిద్ధమవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates