రాజకీయాల్లో నాయకులు ఎవరు ఎవరికీ శాశ్వత శత్రువులు కారు. శాశ్వత మిత్రులు కూడా కారు. 2019లో మిత్రులుగా ఉన్న నాయకులు ఇప్పుడు చాలా పార్టీలకు శత్రువులుగా మారారు. టీడీపీని తీసుకుంటే. వల్లభనేని వంశీ, కరణం బలారం, శిద్దా రాఘవరావు.. ఇలా అనేక మంది శత్రువులుగా మారారు. వీరిలో కొందరు పార్టీని టార్గెట్చేసి నిప్పులు చెరుగుతున్నారు. ఇక, అధికార పార్టీ వైసీపీకి కూడా ఇలా రెబల్ అయిన నాయకుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. కారణాలు ఏవైనా కూడా ఆయన రెబల్ అయ్యారు. పార్టీలోనే ఉంటూ. సీఎం జగన్ బెయిల్ రద్దుకు ప్రయత్నించారు.
ఇక, రఘురామపై ఏపీ ప్రభుత్వం కూడా కేసులు పెట్టి పోలీసులతో కొట్టించిందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. ఆయన ఏపార్టీలో ఉంటారు ? ఏపార్టీ ఆయనకు మద్దతుగా ఉంటుంది.? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఆయన టీడీపీలో చేరతారని.. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అయితే.. ఇంతోలోనే.. ఆయన అసలు బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని ఒకరిద్దరు చెబుతున్నారు. అయితే.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోకుండా కొందరు వైసీపీ నాయకులే.. చక్రం అడ్డువేస్తున్నారని అంటున్నారు.
దీంతో అసలు రఘురామ ఏ పార్టీలో ఉంటే బెటర్ అనే ఆలోచన వస్తోంది. ప్రస్తుతం ఆయన ఎటూ మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే.. వైసీపీ ఆయనను వదులుకోలేదు. ఆయన కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. అప్పటి పరిస్థితిని బట్టి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే.. బీజేపీలో ఉంటే.. ఆయనకు బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనపై కొన్ని బ్యాంకుల కేసులు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అండ ఉంటే తప్ప ఆయన వాటి నుంచి బయటకు రాలేరు.
అయితే.. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకపోతే.. ఆయన పోటీ చేసినా.. ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఆయన టీడీపీలోకి వెళ్లడం ద్వారా.. గెలిచే అవకాశం ఉంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. ఒకవేళ రేపు ఓడిపోయినా.. చంద్రబాబు ఆయనను రాజ్యసభకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీలో చేరితే.. ఓడిపోయినా.. రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. దీంతో రఘురామ ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates