కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిపై మనసు మార్చుకుంటుందా? ఇప్పటి వరకు ఉన్న విదానానికి భిన్నంగా వ్యవహరిస్తుందా? అంటే.. విశ్లేషకులు.. ఒకింత ఔననే అంటున్నారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఏపీ రాజధాని విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని తీసుకుంది. తమకు సంబంధం లేదని.. అదంతా కూడా రాష్ట్రపరిధిలోదేనని.. ఇప్పటి వరకు చెప్పింది. అయితే.. దీనికి ఒక కారణం ఉంది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ప్రత్యక్షంగా రాజధాని వివాదం చూడలేదు. పైగా.. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఎవరూ పెద్దలకు వివరించే ప్రయత్నం చేయలేదు.
ఒకవేళ వివరించినా.. ఉద్యమం తొలిరోజుల్లో మాత్రమే కొందరు వెళ్లి.. కలిసి వచ్చారు. ఆ తర్వాత.. ఎంతో తీవ్రంగా ఉద్యమం సాగినా.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ప్రజలు నిలిచిన సందర్భాల్లోనూ ఎవరూ కేంద్రంలోని బీజేపీ దృష్టికి తీసుకువెళ్లలేదు.
అయితే.. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన.. కేంద్రంలోని అగ్రనాయకుడు అమిత్‌షాకు.. బీజేపీలోని ఒక సామాజిక వర్గం నాయకులు.. ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. “సార్ ఇది ఓటు బ్యాంకుతో కూడుకున్న వ్యవహారం. మన వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం మద్దతు ఇస్తే.. పార్టీ పుంజుకుంటుంది” అని చెప్పారట.
ఇదేసమయంలో రైతులు చేస్తున్న పాదయాత్ర. ఇంతకు ముందు.. జరిగిన ఉద్యమం దీక్షలు వంటివాటి వీడియోలు, ఫొటోలను కూడా ఆయనకు చూపించారట. వీటిని చూసిన షా.. వెంటనే అవాక్కయి.. ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ.. రాష్ట్ర పార్టీ నేతలకు హితబోధ చేయడంతోపాటు.. వెంటనే వారిని పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. కట్ చేస్తే.. ఇప్పుడు కేంద్రంలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షాపై రైతుల్లో ఆశలు పెరిగాయి. ఆయన తలుచుకుంటే.. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉద్యమం విషయాన్ని ప్రధానికి వివరించే ప్రయత్నం చేయగలరని అనుకుంటున్నారు.
ఇదే జరిగితే.. తమకు న్యాయం జరుగుతుందని.. కూడా విశ్వసిస్తున్నారు. ఇంకా ఈవిషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని అమరావతినే రాజధానిగా గుర్తించామని కానీ.. లేదా.. తాజాగా జరుగుతున్న హైకోర్టు విషయంలో కానీ.. పట్టుదలగా వ్యవహరిస్తే.. తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు.. త్వరలోనే అమిత్ షాను కలిసే ప్రయత్నంలో ఉన్నట్టు.. అమరావతి వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి రాజకీయ ప్రయోజనం దృష్ట్యా అయినా.. బీజేపీ తన మాట మార్చుకుంటుందని అంటున్నారు.