కృష్ణా జిల్లా జనసేనలో ఊపు రానుందా? ఇప్పటి వరకు కేవలం విజయవాడ వరకే పరిమితమైన జనసేన దూకుడు.. ఇక నుంచి జిల్లాలోనూ ఊపందుకోనుందా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఇక్కడ మారుతున్న పరిణామాలు.. జనసేనలో మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయని అంటున్నారు.
తాజాగా కీలకమైన నాయకుడు ఒకరు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే డీవై దాస్. రాజకీయంగా వివాద రహిత నాయకుడుగా.. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న దాస్.. త్వర లోనే జనసేన తీర్థం పుచ్చుకునేందుకురెడీ అవుతున్నారు. దీంతో జిల్లా పార్టీలో ఊపు రావడం ఖాయమని అంటున్నారు.
డీవై దాస్. ఈ పేరు రాజకీయాల్లో చాలా మందికి సుపరిచితమే. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత.. తొలిసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. వివాద రహితునిగా.. వినయశీలిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఆయనకు ఎంతో మంది సన్నిహితులు కూడా ఉన్నారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో మంది నాయకులు కాంగ్రెస్‌ను వదిలేసినా.. దాస్ మాత్రం.. కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో పామర్రు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు.
అయితే.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై ఓటమి పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి కొంతకాలంగా రాజకీయలకు దూరంగా ఉన్నారు. మళ్లీ.. 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ టికెట్ ఆశించారు. కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. అనంతరం వైసీపీ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీలో చేరారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు.
ఇక్కడ కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తనకు టికెట్ కష్టమని భావించిన దాస్ జనసేనలో చేరుతున్నారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దాస్ వర్గీయులు కూడా జనసేనలో చేరేందుకు చర్చలు జరుగుతున్న విషయం ధ్రువీకరించారు. దీంతో ఇటు ఆయనకు, మరోవైపు పార్టీకి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.