వైసీపీలో విషాదం.. ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత

ఏపీ అధికారపక్షంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ అనారోగ్యంతో కన్నుమూశారు. 65 ఏళ్ల వయసున్న పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా అకాలమరణం చెందారు. శుక్రవారం సైతం ఆమెకు మండలి సమావేశాలకు హాజరు అయ్యారు. అలాంటి ఆమె రోజు గడిచేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సభలో తమతో ఉన్న వ్యక్తి.. ఈ రోజు నుంచి ఇక ఎప్పటికి లేరన్న బాధ వారిని వేధిస్తోంది.

కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కరీమున్నీసా.. వైఎస్ జగన్ పార్టీ పెట్టటంతో కాంగ్రెస్ నుంచి ఆయన పార్టీలోకి వచ్చేశారు. పార్టీని పెట్టిన నాటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె.. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి.. కార్పొరేటర్ గా విజయం సాధించారు. పార్టీకి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. మార్చిలో ఆమెకు ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. విజయవాడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన కరీమున్నీసా.. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయి వరకు సొంతంగా ఎదిగారు.

శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న ఆమె.. మండలి సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆమెకు రాత్రి వేళ అస్వస్థతకు గురికావటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె పోటు కారణంగా ఆమె మరణించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి గడిచిన వారం రోజులుగా ఆమె ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె కుమారుడు రుహుల్లా ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని ఇంటికి చేర్చారు. ఆమె మరణ వార్త విన్న వైసీపీ నేతలంతా భారీ షాక్ కు గురవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆకస్మిక మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.