టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం, గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆయనకు బలమైన మద్దతు ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. దీనిలో తొలి అంకంగా వచ్చిన.. కుప్ప మునిసిపాలిటీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంపీలు.. మరెంతో మంది నాయకులను, వలంటీర్ వ్యవస్థను ఇక్కడ మోహరించి.. ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేసిందనే విమర్శల మధ్య కుప్పం ఎన్నికలు ముగిశాయి. అయితే.. వైసీపీ భావిస్తున్నట్టు..కుప్పంలో మునిసిపాలిటీని వైసీపీ దక్కించుకున్నంత మాత్రాన వైసీపీకి లభించేది ఏంటి? నిజంగానే చంద్రబాబు ఫేట్ అవుట్ అవుతారా? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న కీలక అంశం.
రాజకీయంగా దూకుడు మంచిదే. ప్రత్యర్థులపై పైచేయిసాధించాలనే పట్టుదలా మంచిదే. అయితే.. దీనికి కూడా కొన్నిహద్దులు ఉంటాయి. కానీ, వైసీపీ వీటిని పూర్తిగా చెరిపేయడం ద్వారా.. రాజకీయంగా తన వ్యూహాలు అమలు చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబును నైతికంగా రాజకీయ హననం చేయాలనేది వైసీపీ వ్యూహం. ఆయన ఒక్కడినీ.. రాజకీయంగా ఒంటరిని చేయడం.. లేదా.. రాజకీయంగా ఓడించడం చేయడం ద్వారా.. టీడీపీ రూపు రేఖలు తుడిచేయాలనేది ప్రధాన అంశం. అయితే.. టీడీపీ అనేక రూపాల్లో వేళ్లూనుకున్న ఈ రాష్ట్రంలో అది సాధ్యం అయ్యే పనికాదనేది.. విశ్లేషకుల భావన. ఎలా అంటే.. రాష్ట్రంలో విపక్షం అనేది ఒకటి ఉండాలి. ఈరోజు టీడీపీ కావొచ్చు. రేపు దీని స్థానం భర్తీ చేసేందుకు మరొకటి రావొచ్చు.
అసలు విపక్షమే లేకుండా చేయాలనే వ్యూహాన్ని ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పుడు.. వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు.. మున్ముందు.. ఆ పార్టీకి బూమరాంగ్ మాదిరిగా ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. స్థానికంలో కుప్పాన్ని వైసీపీ దక్కించుకున్నా.. దానివల్ల ఇప్పటికిప్పుడు.. వైసీపీ లాభించేది ఏమీ ఉండదు. అంతేకాదు..కుప్పం కోల్పోయినట్టయితే.. టీడీపీకి మరింత సానుభూతి పెరుగుతుంది.. తనను, తన రాజకీయాలను కూడా లేకుండా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందనే భావనను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్వయంగా వైసీపీ నే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
ఫలితంగా ఇప్పటి వరకు చంద్రబాబుపై ఉన్న అంతో ఇంతో వ్యతిరేకత పోయి.. అది వైసీపీవైపు మళ్లినా ఆశ్చర్యం లేదు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఏపీ ప్రజలు పాలనాపరమైన అంశాల విషయంలోనే చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారనే వాదన ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా చంద్రబాబును విమర్శించే సమాజం లేదు. ఇప్పుడు.. వైసీపీ చేస్తున్న పనుల కారణంగా.. వ్యక్తిగతంగా చంద్రబాబును వైసీపీ ఏదో చేస్తోందనే భావన టీడీపీ నాయకులు బలంగా తీసుకువెళ్లే అవకాశం వైసీపీనే కల్పిస్తోంది.
దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు భారీ సింపతీ పెరిగితే..అది వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్లస్‌గా మారి.. వైసీపీకి మైనస్‌గా ఇబ్బంది కలిగించే ఛాన్స్ కూడా ఉంది. ఎక్కడికక్కడ పాగా వేయాలనే రాజకీయ లక్ష్యం నెరవేరినా.. అంతిమంగా చూసుకుంటే.. భవిష్యత్తుకు వైసీపీ ఇబ్బందులు సృష్టించుకున్నట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.