దొంగ ఓట‌ర్లు, పోలీసు లాఠీ చార్జీలు..చంద్ర‌బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని కుప్పం మునిసిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. అడుగ‌డుగునా వివాదాలు.. దొంగ ఓట‌ర్లు, పోలీసు లాఠీ చార్జీలు.. ఇలా.. తీవ్ర వివాదానికి కేంద్రంగా ఈ ఎన్నిక‌లు మారిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు.

“వైసీపీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్‌ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు.” అని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు, మేయర్లు, పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎందుకెళ్లార‌ని చంద్ర‌బాబు నిల‌దీశారు. అనధికార వాహనాలను ఎందుకు సీజ్‌ చేయలేదని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. ఎంతమందిని అరెస్టు చేశారో సమాధానం చెప్పాలన్నారు. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌ దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేద న్నారు. ఫిర్యాదును పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్టు చేశారని, దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారని అన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారని బాబు మండి పడ్డారు.

ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే శిక్ష తప్పదని పోలీసుల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల‌ని, అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని.. అయినా.. ప‌ట్టించుకోలేద‌ని.. విమ‌ర్శించారు. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్ఈసీ నీలం సాహ్ని రిజైన్ చేసి వెళ్లిపోవాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వమే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ఉంద‌ని.. చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.