మాయ‌వ‌తి మ‌న‌సులో ఏముందో?

దేశంలో ఇప్పుడు ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌రిగే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ఇంకా కొన్ని నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండడంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేశాయి. వ‌చ్చే ఏడాది కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఎన్నిక‌ల్లో విజ‌యాల కోసం ప్ర‌ధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ఆద్మీ ఇప్ప‌టి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు కాంగ్రెస్‌, ఎస్పీ, టీఎంసీ సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప్రియాంక గాంధీ యూపీని చుట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు స‌మాజ్‌వాదీ పార్టీలో చేర‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక గోవాలో ప‌ర్యటించిన టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా వేడిని రాజేసింది.

ఇలా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విజ‌యం కోసం అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌, ఎస్పీ, టీఎంసీ ప‌ట్టుద‌ల‌తో ముంద‌కు సాగుతుంటే మ‌రో ప్ర‌ధాన పార్టీ మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. అదే బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ). యూపీలో గ‌తంలో చ‌క్రం తిప్పిన ఈ పార్టీ అధినేత్రి మాయావ‌తి ఇప్పుడు మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆమె ఇలా సైలెంట్‌గా ఉండ‌డం వెన‌క ఏమైనా వ్యూహం ఉందేమోన‌ని రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. గతంలో యూపీ రాజ‌కీయాల‌ను మాయ‌వ‌తి శాసించారు. యూపీ సీఎంగా ప‌ని చేసిన ఆమె.. కాన్షీరామ్ త‌ర్వాత దేశంలో అత్యంత ప్ర‌భావిత‌మైన ద‌ళిత నేత‌గా ఎదిగారంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె రాజ‌కీయాల్లో ఎదిగిన తీరు చూసిన వాళ్లు ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలున్నాయి.

మాయ‌వ‌తి వ్యూహాలు ఎవ‌రికి అంత సుల‌భంగా అర్థం కావ‌నే అంద‌రూ అంటుంటారు. దేనికీ వెన‌క‌డాని ఆమె ఆ ధైర్యంతో బ‌ల‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని టాక్‌. ఇక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆమె అనుస‌రించే వ్యూహాలు.. రూపొందించే ప్ర‌ణాళిక‌లు సొంత పార్టీ నేత‌ల‌కే అర్థం కాకుండా ఉంటాయ‌ని చెబుతారు.

ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు ఇంకా అయిదు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్పిటివ‌ర‌కూ ఆమె సైలెంట్‌గా ఉండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ప్రస్తుతం యూపీ రాజ‌కీయాలు చూసుకుంటే కాంగ్రెస్ కంటే కూడా మాయావ‌తి పార్టీ వెన‌క‌బ‌డి ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. మాయావ‌తికి బ‌లంగా నిలిచే ద‌ళిత ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మ‌ళ్లుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఆమె ప్ర‌భావం చూప‌లేక‌పోయార‌ని టాక్‌.

దీంతో ఈ సారి ఆమె ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తోర‌న‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఎన్నిక‌ల‌కు ముందు ఆమె ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని నిపుణులు అంటున్నారు. ఆమె కావాల‌నే ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నార‌ని.. అదును చూసుకుని బ‌రిలోకి దిగుతార‌నే వ్యాఖ్య‌లూ వినిపిస్తున్నాయి.