రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నా.. భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నా.. కొన్ని హద్దులు పాటించాల్సిందే. కొన్ని పద్ధతులు కూడా అనుసరించాల్సింది. దీనికి ఎవరూ మినహాయింపుకాదు. కానీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలకు ఈ హద్దులు తెలియని అనుకోవాలో.. తెలిసి కూడా.. తన మైలేజీ కోసం తాయపత్రం పడుతున్నారని భావించాలో తెలియదు కానీ.. తాజాగా హద్దులు మీరారన్న వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీలు.. రాష్ట్ర ప్రయోజనాలపై పెద్దగా స్పందించడం లేదని.. పార్లమెంటుకు సినిమాకు వెళ్లినట్టు వెళ్తున్నారని.. కూర్చుని వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రధాని మోడీకి రెబ్బరు స్టాంపుల్లా కూడా మారిపోయారని అన్నారు. ముఖ్యంగా విభజన హక్కులు.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి అంశాలను ప్రస్తావించడం లేదని కూడా షర్మిల విమర్శించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తన ఆగ్రహంలో ఆమె తీవ్ర పదాలను వాడారు. ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
“మీరు తెలుగు బిడ్డలే అయితే.. మీలో ప్రవహించేది `తెలుగు వాడి రక్తమే` అయితే..“ అంటూ.. తీవ్ర స్థాయి విమర్శలు చేసి.. హద్దులు మీరారన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 25 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. వీరిలో నలుగురు మినహా.. మిగిలిన వారంతా ఎన్డీయే కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) ఎంపీలే ఉన్నారు. మిగిలిన నలుగురు వైసీపీ ఎంపీలు. ఇక, రాజ్యసభలోనూ కొందరు టీడీపీ, మిగిలిన వారు వైసీపీకి ఉన్నారు. ఆమె ఆగ్రహం నేరుగా ఎవరిపైనో చెప్పకుండా.. అందరినీ గుండుగుత్తగా “మీలో ప్రవహించేది తెలుగు వాడి రక్తమే అయితే“ అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
అంతేకాదు.. ఎంపీలను గొర్రెలతోను, రెబ్బరు స్టాంపులతోనూ షర్మిల పోలుస్తూ వ్యాఖ్యలుచేశారు. దీనిపైనా రాజకీయ నేతల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రశ్నించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ.. ఆ ప్రశ్నల మాటున నోరు చేసుకుని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎందుకన్నది ప్రశ్న. తనకు రాజకీయాల్లో మైలేజీ రాకపోవడానికి ఎవరూ కారణం కాదు. తన స్వయంకృతమే తనకు రాజకీయ మైలేజీని తగ్గిస్తోందన్న చర్చ ఒకవైపుసొంత పార్టీలోనే చర్చగా మారిన సమయంలో ఇలా ఎంపీలపై నోరు పారేసుకోవడం ద్వారా మైలేజీని పొందుతానని ఆమె భావిస్తే..మరింత నష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates