టీటీడీలో వరుస వివాదాలు…ఎందుకిలా?

సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైంది. ఓ పక్క టీటీడీని మరింత అభివృద్ధి చేసేందుకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ నూతన పాలక మండలి కసరత్తు చేస్తుండగా…..మరో పక్క వరుస వివాదాలు టీటీడీని వెంటాడుతున్నాయి.

తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి.

ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపింది. టీటీడీకి చెందిన ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం….చర్చనీయాంశమైంది.

మరోవైపు, జగన్ అధికారం చేపట్టిన తర్వాత వరుసగా టీటీడీలో వివాదాలు చెలరేగడంతో జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారన్న అనుమానాలను వైవీ వ్యక్తం చేస్తున్నారు. లవకుశ కథ వివాదం తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా పలువురు రామ భక్తుల మనోభావాలను ఆ కథ దెబ్బతీసింది.

దీంతో, ఆ విషయంపై ఆగ్రహంతో ఉన్న వైవీ….ఆ కథ వ్యవహారంలో చ‌ర్యలకు ఆదేశించారు. సంబంధిత ఎడిట‌ర్‌పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్గతంగా దేవాలయ ప్రతిష్ఠను కించపరిచేందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కారణమవుతున్న వారిపై చర్యలకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, వారిపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని,చెప్పారు.