బీజేపీ నేత‌ల మౌనం.. బాబును స‌మ‌ర్ధిస్తున్నారా..?

రాష్ట్రంలో నిప్పులు కురిశాయి. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. రాష్ట్ర బంద్ పాటించా యి. మ‌రోవైపు అధికార పార్టీ నిర‌స‌న‌లు చేప‌ట్టింది. చంద్ర‌బాబు దీక్ష‌కు పిలుపు ఇవ్వ‌గానే.. మేం మాత్రం త‌క్కువ‌గా అంటూ.. జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు దిగారు. ఇలా పోటాపోటీ దీక్ష‌లు.. నిర‌స‌న‌ల‌తో రాష్ట్రం అట్టుడికింది.

ఇక‌, రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌లు తూటాల‌ను మించి పేలాయి. నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అంటూ.. వైసీపీ, టీడీపీ నేత‌లు.. మాట‌లు పేల్చుకున్నారు. మ‌రి ఇంత జ‌రిగితే.. వామ‌ప‌క్షాలు స్పందించాయి. ఎక్క‌డో ఉన్న టీఆర్ ఎస్ నాయ‌కులు రియాక్ట్ అయ్యారు (మంత్రి కేటీఆర్‌.. సీఎంను తిట్ట‌డం స‌రికాద‌న్నారు). ఇక‌, ఇత‌ర ప‌క్షాల నాయ‌కులు కూడా త‌ప్ప‌ని చెప్పారు.

మ‌రి ఈ ఎపిసోడ్ మొత్తంలో బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. ఈ నేత‌ల్లో ఒక్క జీవీఎల్ న‌ర‌సింహారావు మిన‌హా.. రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు కానీ.. ఇత‌ర నేత‌లు.. ముఖ్యంగా చంద్ర‌బాబు బంధువు పురందేశ్వ‌రి కానీ.. స్పందించ‌లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌కు రాష్ట్రంలో ఎదురైన అవ‌మానాలు.. తన పార్టీకార్యాల‌యంపై జ‌రిగిన దాడిని.. ప్ర‌భుత్వ దూకుడును తాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాన‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ బాట‌ప‌ట్టారు. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎవ‌రితో మాట్లాడ‌తారు.. అంటే.. కేంద్ర మంత్రి అమిత్ షా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలేన‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు అంటే.. సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు వీరిలో ఎవ‌రూ బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ నేత‌లు ఒక్క‌రూ స్పందించ‌లేదు. వైసీపీని కానీ.. టీడీపీని కానీ.. త‌ప్ప‌ని చెప్ప‌లేదు. పైగా.. వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్టు.. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు.. అమిత్ షా తిరుప‌తికి వ‌స్తే.. రాళ్లేయించార‌ని.. ప్ర‌ధాని మోడీని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశం నుంచి త‌రిమి కొడ‌తామ‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను వెలుగులోకి తెచ్చారు. మ‌రి ఈ విష‌యాల‌పై అయినా.. బీజేపీ నేత‌లు స్పందించాలి క‌దా.. ? అంటే.. అదేమీలేకుండా వారు కాల‌క్షేపం చేస్తున్నారు.

అంటే.. అస‌లు ఈ గొడ‌వ‌ను వారు ప‌ట్టించుకోవాల్సినంత స్థాయిలేద‌ని భావిస్తున్నారా? లేక‌.. ఈ ర‌గ‌డ‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని అనుకుంటున్నారా? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ.. ఇలాంటి స‌మ‌యాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ఈ ప్ర‌య‌త్నం.. క‌మ్యూనిస్టులు చేశారు. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు.. కేవ‌లం బూతుల‌తో కాల‌క్షేపం చేస్తారా? అంటూ.. వారు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. దీక్ష‌లు చేయ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌త్యేక హోదా కోసం.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కానికి వ్య‌తిరేకంగా.. పోల‌వ‌రం నిధులు ఇవ్వ‌ని కేంద్రానికి వ్య‌తిరేకంగా.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇవ్వ‌కుండా ఉన్న కేంద్రానికి వ్య‌తిరేకంగా.. ఈ రెండు పార్టీలూ.. ఎప్పుడైనా దీక్ష‌లు చేశాయా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లపై టీడీపీ, వైసీపీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయ‌ని కూడా నిల‌దీశారు. మ‌రి ఈ పాటి చైతన్యం బీజేపీకి లేదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రి రాష్ట్ర క‌మ‌ల నాథులు దీనికి ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.