సీనియర్ల మధ్య విభేధాలు.. పదవుల కోసమే కానీ పార్టీ కోసం పని చేయని నాయకులు.. అధికార పార్టీకి సవాలు విసిరే ధైర్యం లేకపోవడం.. ఇలాంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైనప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న రేవంత్.. సభలు ర్యాలీలు సమావేశాలంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఆయన.. కొంతమంది నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంత మంది నేతలు కూడా రేవంత్‌తో కలిసి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారు.
అయితే మాజీ కాంగ్రెస్ నేత ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్‌ను కలిసిన ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరాలనే ఆసక్తిని బయటపెట్టారు. అందుకు రేవంత్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ సంజయ్ పార్టీలో చేరే విషయంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా మంచి ట్రాక్ రికార్డు లేని సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడం సరికాదని వాళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో సంజయ్‌ను పార్టీలో చేర్చుకునే విషయాన్ని వాయిదా వేయాలని రేవంత్‌కు హైకమాండ్ సూచించినట్లు తెలిసింది.
సంజయ్‌ను పార్టీలోకి తీసుకు వచ్చే విషయంలో పట్టుదలతో ఉన్న రేవంత్ ఇప్పుడు ఓ కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సంజయ్ తండ్రి డీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే ఆ తర్వాత సంజయ్‌ను చేర్చుకోవచ్చనే ప్లాన్ వేశారని సమాచారం. అంతే కాకుండా డీఎస్‌ను చేర్చుకుని ఇటు బీజేపీనీ అటు టీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న డీఎస్.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్లో ఆయనకు ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఆయన్ని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకు వస్తే బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన రెండో కుమారుడు అరవింద్‌కు కూడా చెక్ చెప్పినట్లు అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మరి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తారా? రేవంత్ వ్యూహం ఫలిస్తుందా? అన్నది వేచి చూడాలి.