దాచాలంటే.. దాగదులే.. అన్నట్టుగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. ప్రజలకు నేను తప్ప ప్రత్యామ్నాయం లేదని చెప్పుకొనే కేసీఆర్ .. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. మరింతగా తనను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పుకొంటున్నారు. అయితే.. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ పాలన పై ప్రజలు ఎలా ఉన్నారు? ఆయన గురించి ఏం చెబుతున్నారు? అనే విషయాలను పరిశీలిస్తే.. చాలా ఆశ్చర్యకరమైన రిజల్టే వచ్చిందని తేలింది.
దేశవ్యాప్తంగా ఏటా.. ముఖ్యమంత్రుల పనితీరును పరిశీలించి.. ప్రజల్లో వారికి ఉన్న అభిమానం.. వారు ఏమనుకుంటున్నారు? అనే అంశాలను వడబోసి.. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ ఎస్)-సీ ఓటర్ పేరుతో సర్వే ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ ఏడాది కూడా తాజాగా ఐఏఎన్ ఎస్ -సీ ఓటరు ఫలితాలు వచ్చాయి. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో అత్యుత్తమ సీఎంలపై ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే చేసింది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ నిలిచారు.
ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వేలో ఓటర్లు భూపేష్కు జై కొట్టారు. ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పాలన వంటివి ఆయనకు మంచి మార్కులు పడేలా చేశాయి. ఆయనను ఒక కంపెనీకి సీఈవోగా ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిర్వహించిన సర్వేలో.. ఆయనకు ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు.. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో అందరికన్నా చివరి స్థానంలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు 30.30 శాతం మంది ఓట్లు వచ్చినట్లు ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. మరి దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates