తెలంగాణ ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్… ఆపార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న పార్టీ అధినేత కేసీఆర్.. అనూహ్యంగా ఇక్కడి ఎస్సీ సామాజిక వర్గం ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే.. ఆయన దళిత బంధును ప్రకటించి.. ఒక్కొక్క ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై అనేక విమర్శలు.. వివాదాలు వచ్చినా..ఆ యన ఖాతరు చేయకుండా.. వ్యవహరించారు. కేవలం ఉప ఎ న్నికను దృష్టిలో ఉంచుకునే.. ఇక్కడ దళిత బంధును అమలు చేస్తున్నారని .. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ..కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. టీఆర్ ఎస్ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. దళిత బంధుకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో 12 రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న పోలింగ్ ఉన్న నేపథ్యంలో దళిత బంధు తమ ఆశలను నెరవేరుస్తుందని.. కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ పథకానికి బ్రేకులు వేశారు. ఈ పథకం అమలును హుజూరాబాద్‌లో తక్షణం నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి తీవ్ర ఎదురు దెబ్బతగిలిందని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద.. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేయనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు కోసం రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు నాలుగు రోజుల ముందు నుంచి విడతల వారీగా పంపిణీ చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో(శాచురేషన్ మోడ్ లో) వర్తింప చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ పథకానికి బ్రేకులు వేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం గమనార్హం. అయితే.. ఈ పథకాన్ని తాము ఉప ఎన్నికలకు ముందుగానే ప్రారంభించాం కనుక.. అమలుకు అడ్డు చెప్పడం సరికాదని పేర్కొంటూ.. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.